ఓ మహిళ హత్యకు దారితీసిన 'సరదా మాట'... ఏంటది?
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మాయిలను లేదా మహిళలను ఎవరైన పురుషుడు... నన్ను పెళ్లి చేసుకుంటావా? అని సరదాగా అడుతుంటాడు. ఇపుడు ఇలాంటి సరదా మాటే ఓ మహిళ హత్యకు దారితీసింది. ఈ దారుణం కడప జిల్లా పులివెందులలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, పులివెందుల పట్టణానికి చెందిన నాగమ్మ అనే మహిళ లింగాల మండలం పెద్దకూడాల శివారుల్లో గొర్రెలను మేపుతోంది. అక్కడే ఆమె ఇటీవల హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ విచారణలో హత్యకు గల కారణాలను పోలీసులు ఛేదించారు. హత్యకు ముందు రోజు నాగమ్మ మైనర్లతో మాట్లాడుతూ.. తనను పెళ్లి చేసుకుంటావా అని సరదాగా ప్రశ్నించింది.
ఆ ప్రశ్నకు కోపగించుకున్న వారు.. మరుసటి రోజు ఆమె గొర్రెలు మేపుతున్న చోటుకి వెళ్లి గొడవ పడ్డారు. ఈ గొడవలోనే ఆమెను బండరాయితో కొట్టి చంపారు.
వారిద్దని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జిల్లా బాలల నేరస్తుల గృహానికి తరలిస్తామని తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు అందించారు.