పాతబస్తీలో లాక్‌డౌన్‌కు తూట్లు... దగ్గరుండి పెళ్ళి జరిపించిన పోలీసులు..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దీంతో కరోనా కట్టడి కోసం లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు తిరిగిన, వాహనాలు కనిపించినా పోలీసులు కేసులు నమోదు చేస్తూ సీజ్ చేస్తున్నారు. అలాంటి సమయంలోనూ ఓ పారిశ్రామికవేత్త కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అదీకూడా లాక్డౌన్‌కు తూట్లు పొడుస్తూ, పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి ఈ పెళ్లిని దగ్గరుండి మరీ జరిపించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ పాతబస్తీలో దుబ్బె పెర్‌ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి కమటి పుర పీఎస్ పరిధిలోని సవేర ఫంక్షన్ హాల్‌లో జరిగింది. ఈ పెళ్ళికి వందలాది మంది హాజరయ్యారు. వీరిలో వీవీఐపీ, వీఐపీ, రాజకీయనాయకులు ఉన్నారు.
ముఖ్యంగా, ఈ పెళ్లికి సౌత్ జోన్ పోలీసులు సెక్యురిటీ కల్పించారు. సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు జరిగిన పెళ్లి వేడుకలకు హోమ్ మంత్రి మహుమద్ అలీ హాజరయ్యారు. ఈ తతంగంపై తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, హైదరాబాద్ సీపీలకు ఎంబీటీ ప్రెసిడెంట్ అంజదుల్లాఖాన్ ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేశారు.
'సవేరా ఫంక్షన్ హాల్‌లో ఏం జరుగుతోంది? లాక్డౌన్ సమయంలో ఇంత మంది జనాలు ఎందుకు పోగయ్యారు? లాక్డౌన్ సమయంలో రోడ్డు ఎక్కితేనే వాహనాలు సీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని వాహనాలు ఎక్కడ నుండి వచ్చాయి? హైదరాబాద్ పాతబస్తీలో లాక్డౌన్ రూల్స్ పాటించట్లేదా? సవేరా ఫంక్షన్ హాల్‌లో జరిగిన పెళ్లిపై ఎవరిపై చర్యలు తీసుకుంటారు? దగ్గరుండి సెక్యురిటి ఇచ్చిన పోలీసులపైనా లేక పెళ్లి జరిపించిన దుబ్బే కుటుంబపైనా?' అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.