1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , గురువారం, 12 ఆగస్టు 2021 (11:45 IST)

కోటి మందికి తెలుగు నేర్పే య‌త్నంలో కంచిస్వామి

దేశవిదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు నేర్పడానికి ఒక అంతర్జాతీయ సంస్ద అవసరమని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంధ్ర సరస్వతి స్వామి సూచించారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ద ప్రసాద్ కంచిలో స్వామీజిని కలసి తెలుగు భాషా సంస్కృతుల వికాసంపై చర్చించారు.

తమిళనాడులో ఉన్న కోటి మంది పైగా ఉన్న తెలుగు వారికి సులభ తెలుగు పేరిట తెలుగు నేర్పే కార్యక్రమం చేపట్టి, తెలుగు ప్రాంతాలతో సంబంధ, బాంధవ్యాలు కలిపే ప్రయత్నం చేస్తున్నామని కంచి స్వామీజీ తెలిపారు. తిరువాయూరులో త్యాగరాజు ఆరాధనోత్సవాలు వలె తాళ్లపాకలో అన్నమయ్య సంకీర్తనోత్సవాలు నిర్వహించే యోచన చేస్తున్నామని స్వామి వారు తెలిపారు.

భుక్తి కోసం పరాయి భాషలు నేర్చుకోవచ్చు, వ్యక్తిత్వాన్ని సంతరింప చేసేది మాత్రం మాత్రృభాషన్న విషయం మరువకూడదని అన్నారు. బుద్ద ప్రసాద్ తాము ఇటీవల ఖండకావ్య పోటీలు నిర్వహిస్తే, 125 కావ్యాలు పోటీకి వచ్చాయని తెలిపితే స్వామివారు సంతోషం వ్యక్తం చేశారు.

కంచి పీఠం పిల్లలకు పద్యల పోటీలు నిర్వహిస్తుందని, నీతి, భక్తి శతక పద్యాలు, వ్యక్తిత్వ వికాసానికి దోహద పడతాయని, పద్యం తెలుగువారి ఆస్తి అన్నారు. తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి మీరు చేస్తున్నసేవ గమనిస్తున్నానని బుద్దప్రసాద్ కి ఆశీస్సులు అందించారు.