కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నిర్మించిన గెస్ట్ హౌస్‌పై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వివాదం నడుస్తోంది. ధర్మవరం శివార్లలోని గుర్రాల కొండపై కేతిరెడ్డి ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్న గెస్ట్ హౌస్‌ను సీజ్ చేశారు. ప్రభుత్వ కొండను ఆక్రమించుకుని కేతిరెడ్డి అక్రమంగా అతిథి భవనాన్ని నిర్మించారని అధికారులు తేల్చారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించినప్పుడే ధర్మవరంలో కేతిరెడ్డి గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించారని బయటపెట్టారు. లోకేశ్ ధర్మవరంలో కేతిరెడ్డి భవనం ఫొటోలు బయటపెడితే, తాను ఉండవల్లి చంద్రబాబు ఇంటి ఫొటోలు బయటపెడతానంటూ కేతిరెడ్డి హల్ చల్ చేశారు.
గుర్రాల కొండపై 2.42 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కేతిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మొత్తం ప్రభుత్వ భూమే ఉందని అధికారులు చెబుతున్నారు. సర్వే నెంబర్ 905-2లో కేతిరెడ్డి సోదరుడు వెంకట క్రిష్ణారెడ్డి భార్య వసుమతి పేరుతో ఆ భూమి కొనుగోలు చేసినట్లు కేతిరెడ్డి చెప్తున్నారు. దీంతో గురువారం కేతిరెడ్డి మరదలు వసుమతికి రెవెన్యూ అధికారులు నోటీసులిచ్చారు.
గుర్రాల కొండపై నిర్మించిన వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంటామని హైకోర్టు ఆదేశాల ప్రకారం సహకరించాలని కోరారు. అంతేకాకుండా ఆ భూమి కబ్జాకు గురైనట్లు బోర్డులు ఏర్పాటు చేశారు. కాగా, రెవెన్యూ అధికారుల రాకతో కేతిరెడ్డి తన వ్యవసాయ క్షేత్రానికి తాళాలు వేయించారు. అధికారుల చర్యలను అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారని అంటున్నారు.