శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (16:40 IST)

టీడీపీ నుంచి చంద్రబాబు - నారా లోకేశ్‌లను తరిమికొట్టాలి : కొడాలి నాని

kodali nani
టీడీపీ నుంచి నారా చంద్రబాబు, నారా లోకేశ్‌లను తరిమి కొట్టి, తెలుగుదేశం పార్టీని నందమూరి వారసులు తమ వశం చేసుకోవాలని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు మరోమారు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. ఆయన ఆకర్షణీయమైన అబద్దాలు, వెన్నపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. అంతేకాకుండా, చంద్రబాబుకు, లోకేశ్‌లకు దమ్ముంటే గుడివాడ లేదా గన్నవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ విసిరారు. 
 
గతంలో ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్ర సర్వనాశనం అవుతుందని వ్యాఖ్యానించిన చంద్రబాబు.. ఇపుడు గతిలేక తిరిగి ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో కొడాలి నాని పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ, భవిష్యత్‌లో చంద్రబాబు, లోకేశ్‌ను తరిమి కొట్టి, ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని జోస్యం చెప్పారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు వంటి నీచ రాజకీయ నేత మరొకరు ఉండరని మండిపడ్డారు. చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసున్నారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు పేరుతో సభ పెట్టుకున్నారని నాని మండిపడ్డారు. 
 
చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. రాజకీయాలంటే బట్టల వ్యాపారం కాదన్నారు. వచ్చే యేడాది జరిగే ఎన్నికల్లో చంద్రబాబు గట్టి ఎదురు దెబ్బ తగలదని, అంతటితో తండ్రీ తనయులు దుకాణం మూసుకోవాల్సిందేనని చెప్పారు.