ముస్లిం వృద్ధురాలి చిరకాల కోరిక : నెరవేర్చేందుకు హామీ ఇచ్చిన నారా లోకేష్... ఏంటది?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీలో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా ఆయన అనేక మంది సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇలాంటి వారిలో ఓ ముస్లిం వృద్ధ మహిళ కూడా ఉన్నారు. ఆమె చిరకాల కోరికను నెరవేర్చేందుకు ముందుకు వచ్చారు. తన సొంత డబ్బులతో ఆ వృద్ధురాలిని హజ్ యాత్రకు పంపిస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం నారా లోకేశ్ పాదయాత్ర నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సాగుతోంది. నియోజకవర్గంలోని పార్నపల్లి గ్రామం మీదుగా యువగళం పాదయాత్ర సాగుతుండగా, దారిపక్కన వృద్ధురాలు షేక్ హుస్సేన్ బేగ్ సైకిల్ పంక్చర్ షాపు నడుపుతుంది. ఆమె లోకేశ్ కంట పడ్డారు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి, ఆమె పక్కలో కూర్చొన్నారు. అపుడు ఆమె తన బాధను వెళ్లబోసుకున్నారు. ఆమె చెప్పినందంతా లోకేశ్ శ్రద్ధగా ఆలకించారు.
తన భర్త షేక్ అబ్దుల్ హకీమ్ (70) పంక్చర్ షాపు నడుపుతూ తనను పోషించేవాడని ఆ వృద్ధురాలు చెప్పింది. ఏడాది క్రితం కిడ్నీ సమస్యతో భర్త చనిపోవడంతో, గతంలో తాను నేర్చుకున్న సైకిల్ పంక్చర్లు వేయడం ఇప్పుడు ఉపాధిగా మారిందని వివరించింది.
రోజంతా పనిచేస్తే రూ.150 ఆదాయం రావడం కష్టంగా ఉందని, నెలకి కరెంటు బిల్లు మాత్రం రూ.500 దాటిపోతోందని హుసేన్ బేగ్ ఆవేదన వ్యక్తం చేసింది. హజ్ యాత్రకి వెళ్లాలనేది జీవితకాల కోరిక అనీ, దాని కోసం తినీ తినక ఓ పదివేలు దాచుకున్నానని, హజ్ వెళ్లాలంటే లక్షలు ఖర్చవుతాయని తెలిసి, దాచుకున్న ఆ పదివేలతో పేద మహిళలకి చీరలు కొని పంచేశానని చెప్పింది.
అరవై ఏళ్లు పైబడిన ఆ వృద్ధురాలు ఎవరిపై ఆధారపడకుండా, తన కాళ్లపై తాను నిలబడడం చూసిన లోకేశ్ ఆమెని అభినందించారు. నిస్సహాయురాలైనా కలత చెందకుండా కష్టపడే తత్వం, దానగుణంతో నలుగురికి సేవ చేస్తున్న షేక్ హుసేన్ బేగ్ ఆదర్శ మహిళ అని కొనియాడారు. పైగా, ఆమె జీవితకాల కోరిక అయిన హజ్ యాత్రకి తన సొంత ఖర్చుతో పంపుతానని లోకేశ్ అక్కడికక్కడే భరోసా ఇచ్చారు. తద్వారా ఆ వృద్ధురాలి ముఖంలో ఆనందం నింపారు.