కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో ముంబైకు తరలించారు. ఆయన వెంట ముగ్గురు వైద్యుల బృందం కూడా వెళ్లింది. ఈ నెల 26వ తేదీన హైదరాబాద్‌లోని నివాసంలో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి నాని ఏఐజీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
నానికి రక్తనాళాల్లో మూడు బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించి, ఓ హెల్త్ బులిటెన్‌ను కూడా రిలీజ్ చేశారు. పైగా, ఆయనకు క్రిటికల్ సర్జరీ చేయాలని సూచించారు. దీంతో ఆయనను ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌కు తరలించాలని కుటుంంబ సభ్యులు నిర్ణయించారు.
ఈ క్రమంలో ఏ ఒక్క నిమిషాన్ని వృధా చేయకుండా ఉండేందుకు వీలుగా హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో తరలించారు. ఆయనతో పాటు ఎయిర్ అంబులెన్స్‌లో ఏఐజీ ఆస్పత్రికి చెందిన ముగ్గురు వైద్యులు కూడా బయలుదేరారు. కొడాలి నాని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆయన అనుచరులు, వైకాపా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నానికి బైపాస్ సర్జరీ నిర్వహించే అవకాశం ఉన్నట్టు సమాచారం.