శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:32 IST)

బతికున్నపుడు వేధించి.. ఇపుడు లాంఛనాలు ఎందుకు? కోడెల ఫ్యామిలీ ప్రశ్న

ఇటీవల హైదరాబాద్ నగరంలో ఆత్మహత్య చేసుకున్న ఏపీ మాజీ స్పీకర్, మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద రావు అంత్యక్రియలను పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కోరారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేందుకు గుంటూరు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. 
 
అయితే, కోడెల కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ లాంఛనాలు తమకేమి వద్దని తేల్చి చెప్పారు. బతికున్న సమయంలో వేధించి, ఇప్పుడు లాంఛనాలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కోడెల కుటుంబీకులెవరూ ప్రభుత్వ మొక్కుబడి లాంఛనాన్ని అందుకునేందుకు సిద్ధంగా లేరని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, కోడెల అంత్యక్రియలు ఆయన అభివృద్ధి చేసిన స్వర్గపురిలోనే బుధవారం మధ్యాహ్నం జరుగనున్నాయి. ఇందుకోసం టీడీపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. అదేసమయంలో తమ అభిమాన నేతకు కడసారి నివాళులు అర్పించేందుకు అభిమానులు పోటెత్తారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా 144 సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు.