మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (09:14 IST)

కోడెల శివప్రసాద్ రావుది ఆత్మహత్యే.. తేల్చిన పోస్ట్‌మార్టం రిపోర్టు

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావుది ఆత్మహత్యేనని పోస్టుమార్టంలో తేలింది. ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయాడని జరిగిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన నివేదికలో తేల్చారు. 
 
సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసంలో కోడెల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఆయన్ను ఇంటిపక్కనే ఉన్న బసవతారకం ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం కోసం కోడెల భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ శవపరీక్ష చేశారు. ఇందులో కోడెలది బలవన్మరణమేనని తేలింది. 
 
గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్న కారణంగానే.. కోడెల ఇంతటి నిర్ణయానికి తెగించి ఉండవచ్చన్న అభిప్రాయం అనుచరుల్లో వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 
 
కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో కోడెల శివప్రసాదరావు తీవ్ర ఆవేదనకు లోనయినట్టు సమాచారం. కుమారుడితో కూడా కొన్ని విభేదాలు ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే రెండు వారాల కిందటే ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు వార్తలు వచ్చాయి. 
 
అయితే అప్పట్లో కుటుంబసభ్యులు సకాలంలో గుర్తించడంతో కోడెలకు ముప్పు తప్పిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. పల్నాడు పులి ఒకప్పుడు ఎంతో గౌరవంగా పులిలా బతికిన తాను, తలవంపులు తట్టుకోలేకపోతున్నానని కోడెల తన సన్నిహితుల దగ్గర వాపోయినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడివుంటారని ఆయన సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు.