ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (14:57 IST)

తండ్రికి మద్యం తాపించి.. పీకలవరకు తినిపించి హత్య చేసిన కుమార్తె!

ఓ కసాయి కుమార్తె కన్నతండ్రిని కర్కశంగా చంపేసింది. తండ్రికి డిన్నర్ పేరుతో ఫుల్‌గా మద్యం తాపించింది. పీకలవరకు భోజనం పెట్టింది. ఆ తర్వాత తాను అనుకున్న పనిని విజయవంతంగా పూర్తిచేసింది. అంటే.. తండ్రి ప్రాణాలు తీసింది. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతాలో జరిగింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కోల్‌కతాలోని క్రిస్టోపర్ రోడ్‌లో నివాసముంటున్న 22 ఏళ్ల వివాహిత భర్తతో విడిపోయి తండ్రి వద్ద ఉంటోంది. అయితే ఆ తండ్రి పెళ్లికి ముందు నుంచే యువతిని శారీరకంగా, మానసికంగా హింసించాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో యువతి అన్నీ భరిస్తూ వచ్చింది. 
 
కాగా.. యువతి భర్త విడిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే తంతు మొదలైంది. విసుగు చెందిన యువతి తండ్రిని కడతేర్చాలన్న నిర్ణయానికి వచ్చింది. అందులోభాగంగా ఈ నెల 21వ తేదీన తన తండ్రిని తీసుకొని రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ తండ్రి కోసం డ్రింక్ ఆర్డర్ చేసింది. 
 
అనంతరం ఇద్దరూ భోజనం చేసి స్ట్రాండ్ రోడ్‌లోని చాద్‌పాల్ ఘాట్‌కు వెళ్లారు. అక్కడ తండ్రికూతుళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా.. మత్తులో ఉన్న తండ్రి నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయాన్ని తన అనుకూలంగా మార్చుకున్న కూతురు.. తండ్రి మీద కిరోసిన్ పోసి నిప్పంటించింది. 
 
మద్యం మత్తులో ఉన్న తండ్రి తప్పించుకోలేక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. నిందితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతిని అరెస్టు చేశామని తెలిపారు.