Earthquake: కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు.. జనాల్లో భయం భయం
కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు జనాలను భయాందోళనకు గురి చేశాయి. గురువారం రాత్రి కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై సుమారు 3.5 తీవ్రతతో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించడంతో, స్థానికుల్లో కొద్దిసేపు భయాందోళనలు నెలకొన్నాయి. ఆదోని పట్టణంతో పాటు మదిరే, సదాపురం, విరూపాపురం, నారాయణపురం, ధనపురం, నాగనదనహళ్లి వంటి గ్రామాల్లో ఈ ప్రకంపనలు మరింత స్పష్టంగా కనిపించాయి.
భూ ప్రకంపనలు సంభవించడంతో, కొందరు నివాసితులు ముందుజాగ్రత్తగా తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి బహిరంగ ప్రదేశాలకు తరలివెళ్లారు. అయితే, ఎలాంటి ప్రాణనష్టం, గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అధికారులు ధృవీకరించారు. ప్రజలు భయపడవద్దని, ప్రశాంతంగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రకంపనలు సంభవిస్తే భద్రతా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
