1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified గురువారం, 18 నవంబరు 2021 (20:01 IST)

భారీ వర్షాలకు తిరుమలలో విరిగిపడుతున్న కొండచరియలు

తిరుమలలో వరుణ దేవుడు దిగి వచ్చినట్లు గత వారంరోజులు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తిరుమలలోని జలాశయాలన్నీ నిండు కుండల్లా మారాయి. 

 
భారీగా వర్షం పడుతుండటంతో భక్తులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. శ్రీవారి దర్సనానికి వైకుంఠ కాంప్లెక్స్‌కు వెళ్ళే భక్తులతో పాటుగా దర్సనం తరువాత బయటకు వచ్చే భక్తులు వసతి గదులకు చేరుకునేందుకు ఇబ్బందులకు గురి అవుతున్నారు.

 
వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాఢవీధులు, లడ్డూ వితరణ కేంద్రం, తిరుమల రహదారుల్లో వర్షపు నీరు భారీగా చేరుకోవడంతో వర్షపు నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.

 
మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులలో భారీవర్షం కారణంగా కొండలో గట్టిగా ఉండే మట్టి పూర్తిగా మెత్తబడటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మొదటి రెండవ ఘాట్ రోడ్డులలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.

 
తిరుమలలోని యాత్ర ప్రదేశాలు వీక్షించేందుకు కూడా భక్తులు మక్కువ చూపడం లేదు. వసతి గదుల్లోనే భక్తులు పరిమితం అవుతున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లు మార్గాన్ని మూసివేశారు. 

 
ఎత్తైన కొండలు కలిగిన ఘాట్ రోడ్లు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అధిగమిస్తోంది. కొండలపై నుంచి ముత్యపు చినుకులు జాలువారుతున్నాయి. పచ్చని చెట్ల మధ్య కొండలపై నుంచి జలధారలా ప్రవహిస్తున్న జలపాతాల వద్ద ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు భక్తులు. 

 
మరోవైపు మొదటి ఘాట్ రోడ్డులో మాల్వాడిగుండం వద్ద జలపాతం ఉదృతంగా ప్రవహిస్తూ ఉండడంతో ఫోటోలు తీసుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో విజిలెన్స్ సిబ్బంది అనుమతించడం లేదు.