గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: గురువారం, 5 ఆగస్టు 2021 (08:51 IST)

ఆర్ధిక ర‌హ‌స్యాల‌ లీక్, మరో ప‌దిమంది ఉద్యోగుల స‌స్పెన్ష‌న్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి ఇపుడు ఆర్ధిక ర‌హ‌స్యాల లీక్ స‌మ‌స్య అధికం అవుతోంది. ప్ర‌భుత్వంలో అత్యంత కీల‌కం అయిన సి.ఎఫ్.ఎం.ఎస్. సమాచారం లీక్ కావడంపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యారు.
 
ఆర్ధిక శాఖ‌కు చెందిన ర‌హ‌స్యాల‌ను లీక్ చేస్తున్నార‌ని, వివిధ దిన‌ప‌త్రిక‌లకు ప్ర‌త్యేకంగా ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఆర్ధిక స‌మాచారం ఇస్తున్నార‌నే ఆరోప‌ణ‌ల‌తో  సి.ఎఫ్.ఎం.ఎస్ ఉద్యోగులు ప‌ది మందిపై తాజాగా స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.
 
ఆర్దిక శాఖ‌కు చెందిన ముగ్గురు ఉద్యోగుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌స్పెండ్ చేసి, 24 గంట‌లు కాకుండానే, మ‌రో ప‌ది మందిపై వేటు ప‌డింది. ఆర్ధిక శాఖ‌కు చెందిన ముగ్గురిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని, దాంతో వారిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ కార్య‌ద‌ర్శి రావ‌త్ చెప్పారో లేదో... కొద్ది గంట‌ల్లోనే ప్ర‌తిప‌క్ష నేత నారా లోకేష్ సి.ఎఫ్.ఎం.ఎస్. స‌మాచారంతో ఒక ట్వీట్ చేశారు. 
 
మింగ మెతుకులేదు కానీ మీసాల‌కి సంపెంగ నూనె చందంగా ఉంది ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ రెడ్డి తీరు అని నారా లోకేష్ ట్విట్ట‌ర్లో విమ‌ర్శించారు. ల‌క్ష‌లాది మంది అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్లు లేవు. రిటైర్డ్ ఉద్యోగుల‌కు పింఛ‌న్ ఖాతాలో ప‌డ‌లేదు. ఒక‌టో తేదీ జీతాలు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇంకా రాలేదు.

ప్రాణాలు కాపాడే 108 సిబ్బందికి మూడునెల‌లుగా వేత‌నాలివ్వ‌లేదు. ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్ పారిశుధ్య కార్మికులు త‌మ పెండింగ్ జీతాల‌డిగితే అరెస్ట్ చేయించిన జ‌గ‌న్‌రెడ్డి... త‌న సొంత  పేప‌ర్ సాక్షికి సీఎఫ్ఎంఎస్ నుంచి ఈ రోజు 16.87 కోట్లు విడుద‌ల చేశారు అని ట్వీట్ చేశారు.
 
ఈ ట్వీట్ మ‌ళ్ళీ క‌ల‌క‌లం రేపింది. ఆర్ధిక శాఖకు చెందిన సి.ఎఫ్.ఎం.ఎస్. ఉద్యోగుల కొంప ముంచింది. ప్రభుత్వ ఉద్యోగులపై మరోసారి కన్నెర్ర చేసింది ఏపీ ప్రభుత్వం. ఇబ్రహీంపట్నం సీఎఫ్ ఎం.ఎస్. కార్యాలయంలో మరో 10 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు ప‌డింది. ప్ర‌భుత్వానికి సంబంధించిన విలువైన సమాచారం బయటకు ఇస్తున్నారని అభియోగంతో ఒక్కరోజే 13 మందిపై చర్యలు తీసుకోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో కలకలం మొద‌లైంది.