శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (07:32 IST)

చిత్తూరు జిల్లా అభివృద్ధికోసం ఏకమవుదాం: మంత్రి మేకపాటి

చిత్తూరు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలంతా జిల్లా అభివృద్ధికోసం కలిసి ముందుకు సాగాలని ఆ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన బీసీ కార్పొరేషన్ల పదవులలో  ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియామకమైన ప్రతి ఒక్కరికి ఆయన శుభాభినందనలు తెలిపారు.

139 కులాలకు చెందిన 56 బీసీ కార్పొరేషన్లను ప్రకటించిన ముఖ్యమంత్రికి అభినందనలు చెబుతూ చిత్తూరు జిల్లాలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ కానూరులోని క్యాంప్ ఆఫీస్ నుంచి  మంత్రి మేకపాటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

చిత్తూరు జిల్లా నుంచి వన్నియకుల క్షత్రియ, పాల ఏకిరి, మొదలియార్, ఈడిగ కార్పొరేషన్లకు ఛైర్మన్ పదవులు దక్కించుకున్న  కె.వనిత, టి.మురళీధర్, తిరుపతూర్ గోవిందరాజు సురేష్, కె.శాంతి సహా డైరెక్టర్లకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రజల ఆకాంక్షలు, ముఖ్యమంత్రి ఆశయాల మేరకు అంతా పని చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి వారికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాను ప్రత్యక్ష్యంగా కార్యక్రమానికి హాజరవనందుకు చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఎమ్మెల్యేలు, బీసీ కార్పొరేషన్ పాలక మండళ్ల ఛైర్మన్లు, సభ్యులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు. ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి కూడా వర్చువల్ గా పాల్గొన్నారు.