శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (17:45 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ : ఆ డబ్బులు ఎక్కడ దాచారో కోర్టుకు చెబుతారు : కేజ్రీవాల్ సతీమణి

sunitha kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ విచారణ జరుగుతుంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్‌లో నిజానిజాలను తన భర్త గురువారం కోర్టులో బయటపెట్టనున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని బుధవారం విడుదల చేశారు. 
 
"నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు. కస్టడీలోను ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచి నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి అతిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తుంది. ఆయనపై కేసులు పెడుతుంది. ఢిల్లీని నాశనం చేయాలని కేంద్రం కోరుకుంటున్నారు. ఈ పరిణమాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు" అన్నారు. 
 
"మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపింది. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి మార్చి 28వ తేదీ కోర్టులో అన్ని నిజాలు బయటపెడతానని కేజ్రీవాల్ చెప్పారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు" అని పేర్కొన్నారు.