మద్యం షాపుల అద్దెల్లో రూ.108.84 కోట్లు మిగులు: ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి

narayanaswami
ఎం| Last Updated: శుక్రవారం, 20 నవంబరు 2020 (08:30 IST)
ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు
రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం,ఎక్సైజ్ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి స్పష్టం చేశారు.

సచివాలయంలోని తన ఛాంబర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. దశల వారీగా మద్యం నిషేధానికి తీసుకున్న చర్యలను తనను కలిసిన మీడియాకు మంత్రి వివరించారు. సంపూర్ణ మద్య నిషేధానికి తీసుకుంటున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తుచేశారు. ఎక్కడా మద్యనిషేధం అమలులో రాజీలేకుండా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

ఇందుకోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక మార్లు ఎక్సైజ్ శాఖతో సమీక్ష సమావేశాలు నిర్వహించారన్నారు. ఏడాది నుంచి ప్రభుత్వం మద్యం అమ్మకాలను చేపట్టిందన్నారు. రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్ షాపులను రద్దు చేశామన్నారు. మద్య నిషేధం అమలు విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చట్టాలను పరిగణనలోకి తీసుకుని పక్కాగా అమలు చేస్తోందన్నారు.

ఇందులో ఎటువంటి అనుమానాలకూ తావు లేకుండా అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేస్తూనే రాష్ట్రంలో మద్యం ధరలను కొంత మేర తగ్గించామని వివరించారు. దీనివల్ల ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాకు బ్రేక్ పడిందన్నారు.

ఎక్కడైనా అక్రమ మద్యం వాహనాల్లో తరలిస్తున్న క్రమంలో పట్టుబడితే, డ్రైవర్లపై కాకుండా యజమానులపై పీడీ యాక్టును ప్రయోగిస్తున్నట్లు మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. గతంలో మద్యం షాపులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని గమనించి ప్రభుత్వమే వాటిని నిర్వహించడానికి చర్యలు తీసుకుందని అన్నారు.

ఈ క్రమంలో ఎక్కువ సంఖ్యలో మద్యం షాపులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయనే విషయాన్ని గుర్తించామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అద్దె చెల్లింపులపై రివర్స్ టెండరింగ్ విధానం చేపట్టామన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.108.84 కోట్లు మిగులు సమకూరిందన్నారు. మున్సిపాలిటీల్లో కొనసాగుతున్న అద్దెలను పరిగణంలోకి తీసుకుని ఈ విధానం అమలు చేసిన‌ట్లు తెలిపారు.

రాష్ట్రంలో మద్యం ధరలను తగ్గిస్తూ నిర్ణయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్ష లేదని మంత్రి నారాయణ స్వామి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పథకాల అమలు తీరును మంత్రి వివరించారు. ప్రజలు సంతోషంగా లేరంటూ ప్రతిపక్షాలు అనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని, దీనికి ముఖ్మమంత్రి వైయస్ జగన్ కు ఆయా సామాజిక వర్గాలు రుణపడి ఉంటారని అన్నారు. ఇంత పెద్దత్తున కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఛైర్మన్లు ,డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు. క‌మర్షియల్ ట్యాక్స్ బకాయిలు వసూలు లో ప్రభుత్వం తొలి మూడు నెలలకు ఇచ్చిన దిశా, నిర్ధేశాలను సంబధిత అధికారులు సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలోని 13 జిల్లాలలో రూ.961.09 కోట్లు రాబట్టాలని లక్ష్యం పెట్టుకోగా, 45 రోజుల్లో రూ.513.89 కోట్లు వసూలు చేయడం జరిగిందని మంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. దీంతో పాటుగా వమర్షియల్ ట్యాక్స్ ను మార్పులు చేర్పులు చేసి మరింత సమర్ధవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
దీనిపై మరింత చదవండి :