26న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె: వామపక్ష నేతలు

left parties leaders
ఎం| Last Updated: శుక్రవారం, 20 నవంబరు 2020 (08:23 IST)
దేశంలో వ్యవసాయ, కార్మిక రంగాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్రంలోని పది వామపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆ రంగాలను కార్పోరేట్ శక్తుల చేతుల్లో పెట్టే క్రమంలో కేంద్రం తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 26న దేశ వ్యాప్తంగా జరుగనున్న సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.

విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరిభవన్‌లో జరిగిన పత్రికా విలేఖరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత పి.ప్రసాద్, ఎం సీపీఐ యూ నేత ఖాద‌ర్‌భాషా, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నేత డి.హరనాథ్, ఎసీయూసీఐ నేత సుధీర్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ... బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్తంగా పోరాటాలకు వామపక్ష పార్టీలు సిద్ధమౌతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఊడిగం చేస్తూ ప్రభుత్వ రంగాలను నాశనం చేస్తోందని మండిపడ్డారు.

దేశంలో ప్రభుత్వ రంగంలో నవరత్నాలుగా పేరొందిన రైల్వేలు, ఎల్‌ఐసీ, విమానయానం, బీఎస్ఎన్ఎల్, తదితర ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడమే దేశభక్తి అవుతుందా? అని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడిన 70 కోట్ల జనాభాపై వ్యవసాయ చట్టాల ద్వారా దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.

పోరాడి సాధించుకున్న అనేక కార్మిక చట్టాలను కేంద్రం నాలుగు లేబర్ కోడ్ బిల్లులుగా మార్చి 40 కోట్ల కార్మిక కుటుంబాలను రోడ్డపాలు చేస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 26న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు వామపక్షాలుగా తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజా సమ్మెకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టాలని చూస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి అనేక నల్లచట్టాలను దేశ ప్రజలపై రుద్దాలని చూస్తున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మిక, కర్షక వర్గం ఏకమై ఈ నెల 26 సమ్మెట దెబ్బ కొట్టాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. వ్యవసాయరంగాన్ని పూర్తిగా కార్పోరేట్ల కబందహస్తాల్లోకి నెట్టి వేయడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రజా ఉద్యమాల ద్వారా తిప్పికొట్టాలని పేర్కొన్నారు.

అంబాని, అదానీల సేవల్లో తరిస్తున్న కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించడానికి 500 రైతు సంఘాలు 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా తలబెట్టిన ఆందోళనలకు గ్రామీణ స్థాయి వరకూ తామంతా ప్రత్యక్ష పోరాటాల ద్వారా మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా కాలంలో ప్రజల ఉపాధి మార్గాలు మృగ్యమయ్యాయని, దీనికి తోడు కేంద్రం అవలంభిస్తున్న కార్పోరేట్ అనుకూల ఆర్థిక విధానాల కారణంగా పేద, మధ్యతరగతి వర్గాలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీలు బీజేపీ చేపట్టిన విద్యుత్ సంస్కరణలు సహా అనేక ప్రజా విద్రోహ విధానాలకు మద్దతు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించే అలోచనను విరమించుకోవాలని, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్నీతిని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లడానికి ఈ నెల 21న పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో విజయవాడలో ఎంబీవీకే భవన్ లో రాష్ట్రస్థాయి సన్నాహక సదస్సును ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న వామపక్ష పార్టీల నేతలు ప‌లువురు మాట్లాడుతూ దేశంలో అధికార గర్వంతో సకల రంగాలను నాశనం చేయాలని చూస్తున్న బీజేపీ విధానాలను ప్రజల్లో ఎండగట్టాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కేంద్ర కార్మికసంఘాలు పిలుపునిచ్చిన ఉద్యమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :