మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 18 సెప్టెంబరు 2017 (21:08 IST)

కౌలు రైతులకు రూ.1,080 కోట్ల వ్యవసాయ రుణాలు... మంత్రి సోమిరెడ్డి

అమరావతి: ప్రభుత్వం అనుమతుల్లేకుండా బయో ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. క్రిమినల్ కేసుల సైతం నమోదు చేస్తామన్నారు. మరో వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో మూడో

అమరావతి: ప్రభుత్వం అనుమతుల్లేకుండా బయో ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హెచ్చరించారు. క్రిమినల్ కేసుల సైతం నమోదు చేస్తామన్నారు. మరో వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో మూడో విడత రైతు ఉపశమన నిధులు జమ అవుతాయని మంత్రి తెలిపారు. 
 
సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 జిల్లాల్లోనూ మొబైల్ భూసార పరీక్షా ప్రయోగశాల కేంద్రాల సర్వీసులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 9 జిల్లాల్లో సంచార భూసార పరీక్షా కేంద్రాలున్నాయన్నారు. కొత్తగా విజయనగరం, కృష్ణా, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు రూ.2.05 కోట్లతో నాలుగు మొబైల్ భూసార పరీక్షా ప్రయోగశాల కేంద్రాల సర్వీసులు వినియోగంలోకి తెస్తున్నామన్నారు.
 
దేశ వ్యాప్తంగా 100 మొబైల్ భూసార పరీక్షా కేంద్రాలుంటే, అందులో ఏపీలోనే 13 కేంద్రాలున్నాయన్నారు. 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో 13.48 లక్షల మట్టి నమూనాలను పరిశీలించి, 54.26 లక్షల భూకమతాలకు సాయిల్ హెల్త్ కార్డులు అందించామన్నారు. 2017-18, 2018-19 సంవత్సరాలకు సంబంధించి 13.58 లక్షల మట్టి నమూనాలను పరిశీలించి, 71.15 లక్షల భూకమతాలకు సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 
 
ఇంతవరకూ రాష్ట్రంలో 6.9 శాతం మేర అధిక వర్షపాతం కురిసిందన్నారు. 482 మిల్లీ మీటర్లకు గానూ 515.7 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందన్నారు. సకాలంలో వర్షం కురవకపోవడం వల్ల 4 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశనగ పంట వేయలేకపోయారన్నారు. వారికి పత్యమ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలను 100 శాతం మేర ఉచితంగా అందజేశామన్నారు. 2015 నుంచి నేటి వరకూ ప్రకృతి వైపరీత్యాలు ఇతర కారణాలకు గానూ రూ.1980 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు అందజేశామన్నారు. 
 
రాష్ట్రంలో ప్రకృతి వ్యసాయంపై రైతుల్లో చైతన్య కల్పిస్తున్నామన్నారు. 2016లో 131 క్లస్టర్లలో 27 వేల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తే, ఈ ఏడాది 268 క్లస్టర్లలో 23 వేల హెక్టార్లలో సాగు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 7.50 లక్షల హెక్టార్లలో ప్రత్తి సాగు అవుతుందని భావించామన్నారు. ప్రభుత్వం చేపట్టిన చైతన్య కార్యక్రమాలతో 5.75 లక్షలకు ప్రత్తి సాగును తగ్గించగలిగామన్నారు. రూ.4 కోట్లతో ప్రత్తిలో గులాబి రంగు పురుగు తెగుళ్ల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపట్టిందన్నారు. ఈ ఖరీఫ్ లో రైతులకు రూ.38 వేల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 
 
ఇప్పటికే రూ.35 వేల కోట్లకు పైగా రుణాలు అందజేశామన్నారు. వాటిలో 10 శాతం మేర కౌలు రైతులకు రుణాలివ్వాలని భావించామని, ఇప్పటి వరకూ రూ.1,080 కోట్లు రుణాలు అందజేశామని మంత్రి తెలిపారు. ఇది ఒక రికార్డు అని అన్నారు. మిగిలిన రుణాలు కూడా త్వరలో కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతు ఉపశమన పథకం మూడో విడత నిధులు మంజూరు చేస్తున్నామన్నారు. మరో వారం రోజుల్లోగా రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు. 
 
నివేదిక రాగానే బోగస్ వ్యవసాయ కళాశాలలపై చర్యలు...
రాష్ట్రంలో ఉన్న 12 బోగస్ వ్యవసాయ కళాశాలలపై దర్యాప్తు చేపట్టామని, నివేదిక రాగానే ఆ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపైనా కఠిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ అనుమతుల్లేకుండా బయో ఉత్పత్తులు అమ్మకాలు సాగిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొన్నారు.
 
సంచార భూసార పరీక్షా కేంద్రాల ప్రారంభం....
అంతకుముందు సచివాలయంలో రెండు సంచార భూసార పరీక్షా కేంద్రాల వాహనాలను మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా నేరుగా వ్యవసాయ భూముల దగ్గరకెళ్లి అక్కడున్న మట్టిని వ్యవసాయ శాఖాధికారులు పరీక్షిస్తారన్నారు. ఆయా భూముల్లో ఏయే పంటలు వేయాలి, ఏ రకమైన ఎరువులు వాడాలో రైతులకు తెలియజేస్తారన్నారు. ఈ  కార్యక్రమంలో  వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్, ఏపీ సీడ్స్ ఎం.డి. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.