జగన్‌ని చూసి ట్రంప్ నేర్చుకున్నాడు.. కనకరాజ్ వస్తే అన్నీ ఏకగ్రీవాలే : జేసీ దివాకర్

jc diwakar reddy
ఠాగూర్| Last Updated: గురువారం, 19 నవంబరు 2020 (17:09 IST)
వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు మాటల తూటాలు పేల్చారు. ఆంధ్రా జగన్ రెడ్డిని చూసి అమెరికా డోనాల్డ్ ట్రంప్ నేర్చుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

గతంలో ఏపీ రాష్ట్ర ప్రధానాధికారిగా నియమించిన మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనకరాజ్‌ను తిరిగి పునర్నియమించి, స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడ వేశారని, అందుకే ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను ఆలస్యం చేస్తోందని ఆరోపించారు.

ఆ లెక్కన చూస్తే ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఉన్నంత కాలం స్థానిక ఎన్నికలు జరిగేది కష్టమన్నారు. తాము కోరుకున్న కనగరాజ్ ఎన్నికల కమిషనరుగా వస్తే తమ అభీష్టం ప్రకారమే వైకాపా సర్కారు ఎన్నికలు జరుపుకుంటుందన్నారు. ఇంతకుముందు ఏకగ్రీవమైన స్థానాలు చెల్లుబాటు అవుతాయని కనగరాజ్‌తో బలవంతంగా ఆదేశాలు ఇప్పిస్తారని వెల్లడించారు.

ఇకపై ఎస్ఈసీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు అధికారులు హాజరయ్యేది అనుమానమేనని, వారు ఏదో ఒక సాకు చెప్పి సమావేశాలకు దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదన్నారు. ఒకవేళ ఎన్నికలు వస్తే విపక్ష అభ్యర్థులను పోలీసు బలంతో బెదిరించి నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేస్తారని అన్నారు.

ప్రజల్లో తమపై అభిమానం ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు ఏకపక్షంగానే జరుగుతాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు బరిలో దిగకపోవడమే మంచిదన్నారు. ఒకవేళ గెలిచినా ఏదో ఒక ఆరోపణ మోపి పోలీసు కేసు నమోదు చేస్తారని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.దీనిపై మరింత చదవండి :