శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (15:50 IST)

ఫిబ్రవరిలో ఏపీ స్థానిక సమరం : సీఎం జగన్ ప్రభుత్వం సహకరించేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం వెల్లడించారు. ఇటీవల అఖిలపక్ష సమావేశాన్ని ఆయన ఏర్పాటు చేశారు. ఈ భేటీకి ఒక్క వైకాపా మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. వీరందరితో చర్చించిన తర్వాతే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
 
ఇదే అంశంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందిస్తూ, పంచాయతీ ఎన్నికలకు న్యాయపరమైన ఇబ్బందులు లేవన్నారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలన్నారు. ఏపీలో కరోనా ఉధృతి తగ్గిందని, కరోనా కేసుల సంఖ్య 10 వేల నుంచి 753కి తగ్గిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు. 
 
తెలంగాణలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయని గుర్తుచేసిన నిమ్మగడ్డ.. ఎన్నికల నిర్వహణ రాజ్యంగపరమైన అవసరమని అన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమల్లో లేదని, 4 వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని రమేష్ కుమార్ వివరించారు. 
 
ఇకపోతే, ప్రభుత్వం, రాజకీయపక్షాలు, అధికారులంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగపరమైన అవసరమేకాకుండా.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకునేందుకు ఈ ఎన్నికలు అవసరమన్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేష్‌ స్పష్టం చేశారు.