శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (22:45 IST)

కోర్టుకెళ్లిన నిమ్మగడ్డ... ఆగమేఘాలపై నిధులు విడుదల చేసిన జగన్ సర్కారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంతో చీవాట్లు పెట్టించుకోకుండా జాగ్రత్త పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘాన్నికి అవసరమైన నిధులను ఆగమేఘాలపై విడుదల చేసింది. 
 
నిజానికి ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘానికి ఏమాత్రం పడటం లేదు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు మధ్య ప్రచ్ఛన్నయుద్ధమే కొనసాగుతోంది. 
 
అంటే, నిమ్మగడ్డ ఆ స్థానంలోనే కొనసాగడం ఇష్టం లేని వైసీపీ సర్కార్ తాజాగా స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ ఎన్నికల సంఘాన్ని ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరించింది. 
 
దీంతో ప్రభుత్వంపై ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ న్యాయ వ్యవస్థను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికలకు జగన్ సర్కార్ సహకరించడం లేదని ఏపీ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున రిట్ పిటిషన్ దాఖలైంది. 
 
ఎన్నికల సంఘం నిర్వహణకు ఖర్చయ్యే నిధులను మంజూరు చేయకుండా ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని పిటిషన్‌లో నిమ్మగడ్డ పేర్కొన్నారు. అయితే.. ఏపీ ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలుసుకున్న వైసీపీ ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది. 
 
నిమ్మగడ్డ పిటిషన్ వేసిన మరక్షణమే ఎన్నికల సంఘం నిర్వహణ నిధుల కింద రూ.39 లక్షలు విడుదల చేసింది. ఆపై రూ.40 లక్షలకు గానూ రూ.39 లక్షలు విడుదల చేశామని, దీనిపై అదనంగా ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించడం గమనార్హం. ఏదైనా అవసరం ఉంటే ఏపీ ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని సంప్రదించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు. 
 
అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘం విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని తాము గమనిస్తున్నామని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించడం గమనార్హం. పైగా, జరుగుతున్న పరిణామాలను తాము గమనిస్తే తప్పేమిటని న్యాయమూర్తి ప్రభుత్వ అడ్వకేట్‌ను సూటింగా ప్రశ్నించడం జరిగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని, ప్రభుత్వ వైఖరితో హైకోర్టును ఆశ్రయించాల్సిరావడం బాధాకరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.