ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 ఏప్రియల్ 2021 (17:55 IST)

విద్యార్థుల పాలిట కంసుడు వైఎస్. జగన్ : నారా లోకేశ్ ధ్వజం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని విద్యార్థుల పాలిట కంసుడుగా అభివర్ణించారు. ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించడం తగదని హతవు పలికారు. 
 
ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాప్తి తీవ్రస్థాయిలో ఉన్న దశలో కేంద్రంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేశాయని వెల్లడించారు. కానీ ఒక్క ఏపీలోనే పరీక్షలు నిర్వహిస్తామని మొండిగా ముందుకువెళ్లడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు.
 
విద్యార్థుల భవిష్యత్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జగన్ అధ్వాన్నపు పాలనలో బతికుంటే కదా భవిష్యత్తు అని వ్యంగ్యం ప్రదర్శించారు. అంబులెన్స్‌లు రాక, ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతున్నారని గుర్తుచేశారు. కరోనా మృతులతో మార్చురీలు నిండిపోతున్నాయని, అంత్యక్రియలకు శ్మశానాల వద్ద క్యూలు కనిపిస్తున్నాయన్నారు. ఈ దృశ్యాలు వైకాపా పాలకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
 
అనేక మంది కరోనా రోగులు ఆసుపత్రిలో బెడ్డు దొరక్క రోడ్డుపైనే కుప్పకూలిపోతున్నారని వివరించారు. ఇవన్నీ పట్టించుకోకుండా పరీక్షల పేరుతో 15 లక్షల మందికిపైగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం ఫ్యాక్షన్ సీఎంకు తగదని లోకేశ్ హితవు పలికారు.