కేసీఆర్ కోలుకుని ప్రజాసేవకు నిమగ్నం కావాలి - అదో మూర్ఖపు చర్య : పవన్
కరోనా వైరస్ సోకిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ఆయన ఫామ్ హౌస్‌లో క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన ఆరోగ్యాన్ని కొంతమంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఆయన కోలుకుని ఎప్పటిలాగే ప్రజా సేవలో నిమగ్నం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు పవన్ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.
అలాగే, మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరినట్లు సమాచారం అందిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయన కూడా త్వరగా కోలుకోవాలని తాను దేవుడిని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పారు. కాగా, పవన్ కల్యాణ్‌కు కూడా కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉండి అక్కడే చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. పనవ్ కూడా తన వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వైసీపీ సర్కారు నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమేనంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ నిర్ణయంతో లక్షలాది విద్యార్థులను మాత్రమే కాకుండా వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని ఆయన గుర్తు చేశారు.
పరీక్షల రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. తక్షణమే 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.