శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 ఏప్రియల్ 2021 (16:10 IST)

నారా లోకేష్ ప్రమాదకరమైన వైరస్.. ఏకైక వ్యాక్సిన్ తారక్.. వర్మ సలహా

తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడు వీడియో కలకలం రేపింది. నారా లోకేష్ పైనే నేరుగా ఆ వీడియో విమర్శలు చేస్తున్నట్టు ఉంది. ఆయనే ఇలా ఉంటే టీడీపీ పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది అంటూ అచ్చెన్నాయుడు మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా టీడీపీ పరిస్థితి ఇలా అవ్వడానికి లోకేష్ కారణమంటున్నారు వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. 
 
సందర్భం వచ్చిన ప్రతిసారి టీడీపీ నేతలపై కామెంట్లు, ట్వీట్లు చేసే రామ్ గోపాల్ వర్మ. తాజాగా లోకేష్‌పై వరుస ట్వీట్ల వాన కురిపించారు. ట్వీట్‌లో చెప్పాలి అంటే టీడీపీకి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుందన్నారు వర్మ. అది కూడా చాలా ప్రాణాంతకమైందన్నారు. ఆ వైరస్‌ను అలానే వదిలేస్తే టీడీపీ నేతలు, కార్యకర్తలకు అందరికీ ప్రమాదం అని చెప్పారు. అయితే ఆ ప్రమాదకరమైన వైరస్‌కు విరుగుడు కూడా ఉందన్నారు. ఆ విరుగుడుకు ఏకైక వ్యాక్సిన్ తారక్ అంటూ సలహా ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.
 
ఇప్పటికైనా టీడీపీ కార్యకర్తలు, నేతల మనోభావాలను పార్టీ అధిష్టానం గుర్తించకపోతే చాలా నష్టం తప్పదని హెచ్చరిస్తూ మరో ట్వీట్ చేశారు. టీడీపీ వెంటనే వ్యాక్సిన్ వేయించాలి అంటూ వర్మ ట్వీట్ చేశారు. అయితే వర్మ ట్వీట్లు కాసేపటికే ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఆయన ట్వీట్లను వైసీపీ సహా, ఇతర ప్రత్యర్థులు రీ ట్వీట్ చేయడం మొదలు పెట్టారు. మీరు చెప్పింది వందకు వంద శాతం అంటూ రీ ట్వీట్ చేస్తున్నారు.
 
వర్మ ట్వీట్లపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వర్మకు ఇతరులపై ఏడవడం తప్ప వేరే పనిలేదు అని మండిపడుతున్నారు. అసలు వర్మ ముందు కరోనా పరీక్షలు చేయించుకున్నారా? వ్యాక్సిన్ వేయించుకున్నారా అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్విట్టర్ వేదికగానే కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం టీడీపీ అభిమానులు, వర్మ, వైసీపీ అభిమానుల మధ్య ఈ ట్వీట్ల వార్ జోరందుకుంది.