ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మదనపల్లి జంట హత్య కేసు : రూ.వేలకోట్ల ఆస్తి స్వాహా చేసేందుకే ప్రేరేపించారా?

చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన అక్కా చెల్లెళ్ల జంట హత్య కేసులో రోజుకోరకమైన ఆసక్తిర అంశం వెలుగులోకి వస్తోంది. పైగా, పలువురిపై అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మృతురాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను స్వాహా చేసేందుకే ఈ హత్యలను ప్రేరేపించారన్న అనుమానం కలుగుతోంది. 
 
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు... అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు అలేఖ్య, సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంశాలను కేంద్రంగా చేసుకుని అనేక కొత్త కొత్త కోణాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 
తాజాగా మరో కొత్త కోణంలో ఈ హత్యలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు బహిర్గతమవుతున్నాయి. దంపతులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నపుడు హైకోర్టు న్యాయవాది రజని పురుషోత్తమ నాయుడును కలసి మాట్లాడారు. జంటహత్యల నిందితులను ఎవరో ప్రేరేపించారని ఆమె తెలిపారు. 
 
సుప్రీం కోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు రజని పురుషోత్తంను జైలులో కలసి మాట్లాడారు. ఈ హత్యలకు ప్రేరేపించింది మాత్రం వేరే వ్యక్తులు ఖచ్చితంగా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 
 
ఈ ఆస్తులను కాజేసేందుకు కూడా ఇలాంటి పన్నాగాలు, కుట్రలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కుటుంబానికి చిత్తూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 
 
మరోవైపు, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో నిందితులైన పురుషోత్తమనాయుడు, పద్మజ దంపతులను చిత్తూరు ఏఆర్‌ పోలీసులు బుధవారం విశాఖ మానసిక వైద్యశాలకు తరలించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో గతనెల 24న పురుషోత్తమనాయుడు, పద్మజ ఇంట్లో క్షుద్రపూజల పేరుతో కుమార్తెలు అలేఖ్య, సాయిదివ్యలను హతమార్చి అరెస్టయిన విషయం విదితమే. 
 
వారి మానసికస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో చిత్తూరు ఏఆర్‌ పోలీసులు బుధవారం పద్మజ దంపతులను తీసుకుని ఎస్కార్ట్‌ వాహనంలో విశాఖకు బయల్దేరారు. 
 
మూడురోజులుగా అరుపులు, కేకలతో జైలు సిబ్బందితో పాటు ఖైదీలను హడలెత్తిస్తున్న పద్మజను మంగళవారం రాత్రి ప్రత్యేక గదికి తరలించేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు.