మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నామినేషన్ వేశారనీ.. చేపల చెరువులో విషం కలిపారు... ఎక్కడ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో అధికార వైకాపాకు చెందిన నేతలు, కార్యకర్తల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేస్తున్న ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులపై దాడులకు దిగుతున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ బెదిరింపులకు దిగడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి.దొంతమూరులో 9వ వార్డుకు తెలుగుదేశం పార్టీ మద్దతుతో కమ్మర సూర్యామణి అనే మహిళ నామినేషన్‌ వేశారు. దీన్ని జీర్ణించుకోలేని వైకాపా కార్యకర్తలు ప్రతీకార చర్యకు పాల్పడ్డారు. 
 
ఆమె భర్త అబ్బులు తమకున్న ఎకరం పొలంలో చేపల చెరువు తవ్వి చేపల పెంపకం నిమిత్తం నక్కబోయిన సన్యాసిరావుకు ఏడాదికి రూ.60 వేలకు లీజుకిచ్చారు. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ చెరువులో విషం కలిపారు.
 
దీంతో చేపలు భారీగా చనిపోయి సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీంతో సన్యాసిరావు భార్య చంద్రకాంతం బుధవారం గుండెపోటుతో మరణించారు. దీంతో కలత చెందిన సూర్యామణి నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.