ఈ-వాచ్ యాప్‌లో ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు: కన్నబాబు
ఈ-వాచ్ యాప్ వెబ్ బేస్డ్, మొబైల్ బేస్డ్ యాప్ అని... ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు తెలిపారు. బుధవారం ఈ-వాచ్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ ఫిర్యాదు ఎవరి దగ్గర ఆగిందో తెలిసేలా ఈ-వాచ్ యాప్‌ను రూపొందించామని చెప్పారు. ఫిర్యాదులను కేటగిరి ప్రకారం విభజించి పరిష్కరిస్తామని తెలిపారు.
మొబైల్‌లో గూగుల్ ప్లేస్టోర్ ద్వారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఫోన్ నెంబర్ ద్వారా ఫిర్యాదుదారుడి ఐడెంటిటీని గుర్తిస్తామన్నారు. ఫిర్యాదు వచ్చాక సీరియస్, నాన్ సీరియస్‌గా కాల్ సెంటర్‌లో విభజస్తారన్నారు.
ఫిర్యాదు సరిగా పరిష్కరం కాకపోతే రీఓపెన్ ఆప్షన్ ఉంటుందన్నారు. యాప్ సెక్యూరిటీ ఆడిట్‌ను మరికొన్ని రోజుల్లో పూర్తి చేస్తామని, సెగ్రిగేషన్‌ను ఎస్ఈసీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని కన్నబాబు తెలియజేశారు.
అంతకుముందు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ-వాచ్ యాప్‌ను ప్రారంభించారు. ఈ-వాచ్ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆవిష్కరించారు.
ఈ -వాచ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని, అక్రమాలు, ప్రలోభాలపై నేరుగా సమాచారం అందించవచ్చని తెలిపారు. ఫిర్యాదులు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఫిర్యాదులను పరిష్కరించిన అనంతరం ఆ వివరాలను ఫిర్యాదుదారులకు చెబుతామని పేర్కొన్నారు. ఈ యాప్ రేపటి నుంచి ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంటుందని వివరించారు.
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజల్లో ఎన్నికలపై నమ్మకం కలిగించేందుకే దీన్ని విడదుల చేస్తున్నామని వివరించారు. స్థానిక ఎన్నికల్లో ఓటర్లంతా సొంత గ్రామాలకు వచ్చి ఓట్లెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఫిర్యాదుల స్వీకరణ కోసం కాల్ సెంటర్‌ని కూడా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రారంభించారు.