తాగడానికి డబ్బులు ఇవ్వలేదని భార్య కాళ్లు నరికేశాడు..
కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య పట్ల ఓ భర్త కర్కోటకంగా ప్రవర్తించాడు. మందు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ తాగుబోతు భర్త భార్య రెండు కాళ్లను నరికాడు. ఈ ఘటన నందిగామలో జరిగింది.
లింగాలపాడుకు చెందిన పిచ్చయ్య మద్యపానానికి బానిసయ్యాడు. రోజూ పీకల దాకా తాగి వచ్చి భార్యను వేధించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మందు తాగటానికి డబ్బు ఇవ్వాలని భార్యతో గొడవకు దిగాడు. ఆమె ససేమిరా అనడంతో అతడికి కోపం కట్టలు తెంచుకుంది. కోపంతో ఊగిపోయిన భర్త గొడ్డలి తీసుకుని ఆమె రెండు కాళ్లను నరికాడు.
దీంతో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగిందని కొందరు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.