పాక్ ఎఫ్-16 విమానాన్ని నడిపిన పైలట్ మాకు తెలుసు!
సరిగ్గా రెండు వారాల క్రితం పాకిస్థాన్‌లోని బాలాకోట్ ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దాడి చేసిన తర్వాత పాకిస్థాన్ ఎదురు దాడికి దిగిన సంగతి విదితమే. పాక్ తన వద్దనున్న ఎఫ్-16 ఫైటర్ జెట్లతో ఇండియాలోని మిలిటరీ స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే ఈ కుట్రను భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. మిగ్-21 బైసన్ జెట్‌ను నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్ పాక్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే ఆ ఎఫ్-16 విమానాన్ని నడుపుతున్న పైలట్ వివరాలు తనకు తెలుసు అని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రకటించారు.
ఓ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇలా మాట్లాడారు. మన రక్షణ బలగాలకు ఆ పాకిస్థానీ పైలట్ వివరాలు తెలుసు అని అంగీకరించడానికి ఆమె మొదటగా నిరాకరించారు. అయితే ఆ తర్వాత మరోసారి అడగడంతో అవును, మాకు తెలుసు అని అన్నారు. అయితే ఆ వివరాలను మాత్రం బయటకు చెప్పలేదు. పాక్‌కు చెందిన ఎఫ్-16 కూలింది అనడానికి ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎలక్ట్రానిక్ ఆధారం కూడా తమ దగ్గర ఉన్నదని భారత విదేశాంగ శాఖ ఇదివరకే వెల్లడించింది. అసలు పాక్ ఈ దాడికి ఎఫ్-16 వాడింది అవడానికి ఆ విమానం నుండి ఫైర్ అయిన అమ్రామ్ మిస్సైల్ శకలాలనే భారత్ ఆధారంగా చూపించింది.