బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (12:49 IST)

అమెరికన్లకు భారతీయుల కుచ్చుటోపీ : రూ.500 కోట్ల మోసం

అమెరికన్లను మోసం చేసి రూ.500 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో ముగ్గురు మహా మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు భారతీయులే ఉండటం శోచనీయం. 
 
మోహిత్ దేవేంద్రభాయ్ శర్మ, కునాల్ జగదీశ్‌భాయ్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు గుజరాత్ కేంద్రంగా ఓ కాల్ సెంటర్‌ని ఏర్పాటు చేశారు. కెనడాకు చెందిన జూలియట్ బెల్లె కార్టర్ అనే మరో వ్యక్తిని కూడా తమతో చేర్చుకున్నారు. కార్టర్ సహాయంతో అమెరికన్ల వ్యక్తిగత వివరాలను సేకరించడం ప్రారంభించారు. ఎంచుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి అమెరికా రెవెన్యూ విభాగానికి మీరు పన్నులు సరిగ్గా కట్టలేదని ఇలా చేస్తే శిక్షపడుతుందని బెదిరించసాగారు. 
 
బాధితులు భయపడి వారి ఖాతాల్లోకి డబ్బులు జమ చేశారు. ఇలా ఒకరూ ఇద్దరూ కాదు దాదాపు 15 వేల మందిని వీరు ముగ్గురూ కలిసి మోసం చేసారని సమాచారం. ఈ కుంభకోణం విలువ రూ.500 కోట్లకు పైగా ఉందని పోలీసులు తెలిపారు. మోసాన్ని గుర్తించిన అమెరికా అధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కార్టర్‌ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అదేవిధంగా మోహిత్ దేవేంద్రభాయ్ శర్మ, కునాల్ జగదీశ్‌భాయ్ శర్మ అనే ఇద్దరు భారతీయులను కూడా అరెస్టు చేసారు.