ఆర్మీ రహస్యాలు చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్
అంతర్జాతీయ సరిహద్దు వెంబడి తిరుగుతూ ఆర్మీ రహస్యాలను సేకరించి పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడని గుర్తించిన అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్‌లోని ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని జైసల్మేర్ జిల్లాకు చెందిన నవాబ్ ఖాన్ అనే వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేశారు.
జీప్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఖాన్.. గూఢచార కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులకు అనుమానం వచ్చి, వెంటనే అతడిపై నిఘా వేసి తమ అనుమానాలు నిరూపితమయ్యాక వెంటనే అతడిని అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటలిజెన్స్ ఉమేష్ మిశ్రా తెలియజేశారు.
ఇండియన్ ఆర్మీ సమాచారాన్ని తస్కరించి వాటిని ఓ కోడ్ భాషలో వాట్సప్ ద్వారా చేరవేస్తున్నట్లు పేర్కొన్న మిశ్రా, ఖాన్ గత సంవత్సరంలో పాకిస్తాన్‌ను సందర్శించాడనీ, అప్పటి నుండి ఐఎస్ఐతో టచ్‌లో ఉన్నాడని తెలియజేసారు. ఐఎస్ఐ ఖాన్‌కు గూఢచారానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి, భారత ఆర్మీ రహస్యాలను చేరవేసే బాధ్యత అప్పగించిందని మిశ్రా తెలిపారు.