పాకిస్థాన్ సీరియల్స్ చూస్తుందనీ.. భార్యను కత్తితో దాడి చేసిన భర్త
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి ఇరు దేశాల త్రివిధ దళాలు కయ్యానికి కాలుదూస్తున్నాయి. ఫలితంగా సరిహద్దుల్లో నిత్యం ఫిరంగుల మోత మోగుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సరిహద్దుల్లో భారత బలగాలపై విరుచుకుపడుతున్నారు. ఇక.. సామాన్య ప్రజల సంగతి చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్‌కు తక్షణం గుణపాఠం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ వివాహిత పాకిస్థాన్ సీరియల్స్ చూస్తుండటాన్ని జీర్ణించుకోలేని భర్త.. ఆమెను కత్తితో దాడిచేశాడు. ఈ దారుణం మహారాష్ట్రలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణే నగరంలోని సలీస్ బురీ పార్కు ప్రాంతానికి చెందిన ఆసిఫ్ సత్తార్ నాయబ్ అనే వ్యక్తి తన భార్య, కుమారుడితో కలిసి నివాసముంటున్నాడు.
ఆసిఫ్ హోర్డింగుల వ్యాపారం చేస్తుండగా, భార్య ఇంటిపట్టునే ఉంటుంది. ఈ క్రమంలో పాల ప్యాకెట్ తీసుకురమ్మని తన కుమారుడిని దుకాణానికి పంపింది. కుమారుడు పాలప్యాకెట్‌ను కింద పడేయడంతో పాలు కింద పోయాయి. దీంతో భార్య కుమారుడిని కొట్టింది. ఫలితంగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
మళ్లీ భర్త షాపు నుంచి సాయంత్రం ఇంటికి తిరిగిరాగా భార్య అతనితో మాట్లాడకుండా అలిగి పడకగదిలోకి వెళ్లింది. భార్యతో మాట్లాడేందుకు భర్త పడకగదిలోకి వెళ్లగా, భర్తను పట్టించుకోకుండా భార్య తన మొబైల్ ఫోనులో 'పాకిస్థాన్ డ్రామా' అనే టీవీ సీరియల్ చూస్తూ కనిపించింది.
దీంతో మరింతగా ఆగ్రహించిన అసిఫ్.. పాకిస్థాన్ టీవీ సీరియల్ చూస్తూ.. తనను నిర్లక్ష్యం చేస్తావా అంటూ ఆగ్రహించి కత్తి తీసుకొని భార్యపై దాడి చేశాడు. ఈ దాడిలో భార్య చేతులకు గాయాలయ్యాయి. గాయపడిన భార్యను ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేర పూణే పోలీసులు భర్త ఆసిఫ్ సత్తార్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అతన్ని అరెస్టు చేశారు.