మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: బుధవారం, 13 జూన్ 2018 (20:42 IST)

జగన్ పార్టీ తరపున శ్రీకాళహస్తి నుంచి మంచు మోహన్ బాబు పోటీ చేస్తారా?

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ను ‘అన్నా’ అని పిలిచి, ఆయన్ను దైవంలా ఆరాధించే సినీనటుడు మంచు మోహన్‌ బాబు 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోహన్‌బాబు ఈ ఎన్నికల్లో మళ్లీ క్రియాశీలకం కాబోత

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టిఆర్‌ను ‘అన్నా’ అని పిలిచి, ఆయన్ను దైవంలా ఆరాధించే సినీనటుడు మంచు మోహన్‌ బాబు 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న మోహన్‌బాబు ఈ ఎన్నికల్లో మళ్లీ క్రియాశీలకం కాబోతున్నారు. తన స్వస్థలమైన చిత్తూరు జిల్లా నుంచి వైసిపి తరపున పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. అసెంబ్లీ రౌడీ చిత్రంలో మోహన్‌ బాబు ఎంఎల్‌ఏగా ఎన్నికవుతారు. ఇప్పుడు నిజ జీవితంలో ఎంఎల్‌ఏగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
 
డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబు తన మనసులోని మాటను బయటకు చెప్పడమేగాదు… నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజం. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యునిగానూ పనిచేశారు మోహన్‌ బాబు. లక్ష్మీపార్వతి- ఎన్‌టిఆర్‌ ఒక వర్గం చంద్రబాబు ఇంకో వర్గంగా వున్న సమయంలో మోహన్‌బాబు ‘అన్నగారి’తో నిలబడ్డారు. ఆ తరువాత పరిణామాలతో టిడిపికి దూరంగా ఉండిపోయారు. 
 
అప్పటి నుంచి ఎప్పుడు రాజకీయాల గురించి ప్రశ్నించినా…. సందర్భం వచ్చినపుడు చెబుతానంటూ దాటవేస్తూ వస్తున్నారు. అయితే…. తరచూ రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకెక్కారు. వైసిపి తరపున పోటీ చేసి గెలిచిన ఎంఎల్‌ఏలను టిడిపిలో చేర్చుకోవడంపై ‘ఎంగిలి మెతుకులు తింటున్నారు’ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన వైసిపికి దగ్గరగా ఉన్నట్లు అంతా భావించారు. అంతేకాకుండా… తన కుటుంబంలోని ఓ వివాహం ద్వారా జగన్‌తో బంధుత్వం కూడా ఏర్పడింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
 
మోహన్‌బాబు స్వగ్రామం (మోదుగులపాళెం, ఏర్పేడు మండలం) చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంటుంది. దీంతో అక్కడ నుంచే పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటు చంద్రగిరి నియోజకవర్గంలో మోహన్‌బాబుకు విద్యానికేతన్‌ పేరుతో విద్యాసంస్థల సామ్రాజ్యం ఉంది. ఈ నియోజకవర్గంలోనూ పోటీకి అవకాశాలున్నా… ఇప్పటికే వైసిపి అభ్యర్థిగా సిట్టంగ్‌ ఎంఎల్‌ఏ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఉన్నారు. ఈ ఇద్దరి మధ్య మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్నే ఎంచుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే శ్రీకాళహస్తి నాయకులు, తన అనుచరులతో మోహన్‌బాబు సమాలోచనలు చేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జిగా బియ్యపు మధుసూదన్‌ రెడ్డి ఉన్నారు. ఆయన టికెట్టు ఆశిస్తున్నారు. మోహన్‌ బాబు టికెట్టు అడిగితే…. జగన్‌ కాదనకపోవచ్చు. ప్రస్తుతం శ్రీకాళహస్తికి మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి (టిడిపి) ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన తనయుడు బొజ్జల సుధీర్‌ రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. అదేవిధగా మాజీ ఎంఎల్‌ఏ ఎస్‌సివి నాయుడు కూడా టిడిపి టికెట్టు అడుగుతున్నారు. ఎవరికి టికెట్టు వచ్చినా పోటీ రంజుగా ఉంటుంది. మరి కలెక్షన్ కింగ్ ఏం చెపుతారో వెయిట్ అండ్ సీ.