జగన్ పాలనపై మావోయిస్టులు విసుర్లు
సీఎం జగన్ పాలనపై మావోయిస్టులు విసుర్లు విసిరారు. జగన్ రెండేళ్ల పాలనలో అనేక విజయాలను సాధించిందని ప్రచారం చేసుకుంటున్నారని ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ తప్పుబట్టారు.
శుక్రవారం గణేష్ పేరుతో మావోయిస్టులు మీడియాకు లేఖ విడుదల చేశారు. ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని లేఖలో దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై గొంతు విప్పుతున్న ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రతిపక్ష పార్టీ నేతలపై కేసులు పెడుతున్నారని గణేష్ మండిపడ్డారు.
ప్రభుత్వంపై విమర్శనామత్మక కథనాలు రాస్తున్న మీడియాను కూడా వదిలిపెట్టకుండా కేసులు పెడుతూ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని ధ్వజమెత్తారు.
అమ్మఒడి, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు కార్పొరేట్ శక్తులు లాభాలు చేకూర్చడానికి తప్ప ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయడం కాదని తప్పుబట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాపన కోసం ప్రజలు ప్రాణ త్యాగాలు చేశారని గుర్తుచేశారు.
స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం అమ్మడానికి పెడితే... జగన్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆమోదించిందని ఆరోపించారు. పైకి మాత్రం వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ కార్మికులను మోసం చేస్తున్నారని గణేష్ దుయ్యబట్టారు.