వైకాపాకు జగన్ అధ్యక్షుడు కాదు.. రాబందుల పార్టీకి చీఫ్ : మంత్రి నిమ్మల
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన ఆరోపణలు చేశారు. జగన్.. వైకాపాకు అధ్యక్షుడు కాదని రాబందుల పార్టీకి నాయకత్వం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలను సైతం రాజకీయాలకు వాడుకోవాలని చూడటం దారుణమన్నారు. శవాలను చూస్తే జగన్‌కు పోయిన ప్రాణం లేచి వస్తుందని ఆయన దుయ్యబట్టారు.
మంత్రి నిమ్మల గురువారం పాలకొల్లులో మాట్లాడుతూ, ప్రకృతి విపత్తువల్ల జరిగిన ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా హయాంలో బారికేడ్లు, పరదాలు, ముందస్తు అరెస్టులు తప్ప ఏం జరిగిందని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన రాజధాని పునర్నిర్మాణం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాన్ని రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ గౌరవించేలా అమరావతి నిర్మాణం కొనసాగుతుందని ఆయన చెప్పారు.