శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:19 IST)

దళిత చైతన్య వేదిక ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తానేటి వనిత

దళిత, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమ‌ని మంత్రి తానేటి వనిత చెప్పారు. దళిత చైతన్య వేదిక ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.
 
 
దళిత చైతన్య వేదిక ఆధ్వర్యంలో నందిగామ పట్టణ శివారు పల్లగిరి సమీపంలోని అమ్మ గార్డెన్స్ లో మంగళవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల వల్లనే రాజకీయంగా ఎదిగి రాజ్యాంగబద్ధ పదవులు పొందటం సాధ్యమైందన్నారు. ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరమని, దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విద్యే ప్రధాన ఆధారమన్నారు. 
 
 
అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని అందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడు పడిన కష్టాలు, అవమానాలు ప్రస్తుత దళిత పేద వర్గాలు అనుభవించకూడదనే ఉద్దేశంతోనే రాజ్యాంగంలో దళితులకు అనేక హక్కులు కల్పించడం జరిగిందని తెలిపారు. విద్యతో పాటు నిబద్ధతగా ఉండి సమైక్యంగా నడుచుకుంటూ, అంబేద్కర్ కల్పించిన హక్కుల సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు. 
 
 
అనంతరం మంత్రి తానేటి వనితను ఎమ్మెల్యేలు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, కైలే అనిల్ కుమర్, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ లు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మాదిగ- రెల్లి కార్పొరేషన్ చైర్మన్లు కనకారావు, మధుసూదన్ రావు, లిడ్ క్యాప్ డైరెక్టర్ కోనేరు ప్రియ పలువురు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ప్రజా ప్రతినిధులు, దళిత నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.