మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (19:07 IST)

సీఎం కేసీఆర్ చెన్నైకు ఎందుకు వచ్చారు?... మాజీ గవర్నర్ నరసింహన్ ఎలా ఉన్నారు?

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సాయంత్రం సమావేశమయ్యారు. సాయంత్రం 4.50 నిమిషాలకు స్టాలిన్ నివాసంలోకి తన కుటుంబ సభ్యులతో వెళ్లిన సీఎం కేసీఆర్ 6.05 నిమిషాలకు బయటకు వచ్చారు. దాదాపు గంటా పది నిమిషాల పాటు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరు వివిధ అంశంలపై చర్చించినట్టు తెలుస్తోంది. 
 
సోమవారం తమిళనాడు రాష్ట్ర పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్ తొలి రోజున తిరుచ్చిలోని శ్రీరంగనాథ స్వామి ఆలయ దర్శనానికి వెళ్లారు. ఆ తర్వాత సాయంత్రానికి చెన్నైకు చేరుకుని ఒక స్టార్ హోటల్‌లో బస చేశారు. పిమ్మట మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను పరామర్శించారు. ఈయన అనారోగ్యంతో బాధపడుతూ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అలాగే, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో కూడా సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
 
సాయంత్రం సీఎం స్టాలిన్‌తో కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. వీరిలో సతీమణి దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్, మంత్రి తంగం తెన్నరసు ఉన్నారు. 
 
అలాగే, సీఎం కేసీఆర్‌తో పాటు.. ఆయన అర్థాంగి, కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్, మరికొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా యాదాద్రి పుణ్యక్షేత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సింది సీఎం స్టాలిన్‍‌ దంపతులను సీఎం కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు.