మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 15 జులై 2018 (12:11 IST)

హైదరాబాద్ వాసులను కొట్టి చంపారు.. ఎందుకు.. ఎక్కడ?

మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన బీదర్‌లో హైదరాబాద్‌ వాసులపై దాడి చేసి చంపేశారు. పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా సభ్యులుగా భావించిన స్థానికులు వారిపై దాడిచేసి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ

మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన బీదర్‌లో హైదరాబాద్‌ వాసులపై దాడి చేసి చంపేశారు. పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠా సభ్యులుగా భావించిన స్థానికులు వారిపై దాడిచేసి చంపేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
ఖతార్‌లో పనిచేస్తున్న సల్హాన్‌ ఒబేసుకే.. ఇటీవల బార్కస్‌లోని తన తల్లి వద్దకు వచ్చాడు. ఎర్రకుంటలో నివాసముండే మహ్మద్‌ఆజమ్ (32), సల్మాన్, నూర్‌మహ్మద్‌లను కలిసేందుకు రెండ్రోజుల క్రితం వెళ్లాడు. కర్ణాటక రాష్ట్రంలోని ఔరాద్ తాలూకా హుండికేరాకు చెందిన బషీర్ అనే వ్యక్తి వీరికి స్నేహితుడు. హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తున్న బషీర్.. తమ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలు బాగుంటాయని, వాటిని చూసి తమ స్వగ్రామానికి వెళదామని చెప్పడంతో ఐదుగురూ కర్ణాటకకు మారుతీ బ్రీజా కారులో బయలుదేరారు. 
 
శుక్రవారం సాయంత్రం మార్గమధ్యంలో బాల్‌కూట్‌తండా వద్ద అల్పాహారం కోసం ఆగారు. ఖతార్ నుంచి తాను తెచ్చిన చాక్లెట్లను సల్హాన్ అక్కడి బడిపిల్లలకు పంచిపెట్టాడు. విదేశీ చాక్లెట్లుకావడంతో అవి తక్కువ తీపితో ఉన్నాయి. దీంతో పిల్లలు అక్కడున్న వారికి చాక్లెట్లు ఒకరకంగా ఉన్నాయని చెప్పారు. అప్పటికే పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలు తిరుగుతున్నాయని గ్రామంలో వదంతులున్నాయి. దీంతో కొందరు స్థానికులు ఈ ఐదుగురిని అటకాయించారు. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాలంటూ గద్దించారు. ఈ విషయాన్ని ఒక వ్యక్తి వాట్సాప్‌లో షేర్‌చేశాడు. 
 
విషయం అందరికీ పాకడంతో ఒక్కసారిగా వందలమంది అక్కడకు చేరుకొని దాడికి దిగారు. దీంతో ఐదుగురూ పరారయ్యారు. తండవాసులు ఇచ్చిన సమాచారంతో తదుపరి వచ్చే ముర్కీ గ్రామస్థులు వీరిని అడ్డుకున్నారు. కారులో ఉన్న ఐదుగురిపై దాదాపు 400 మంది దాడిచేశారు. కారును బోల్తాపడేసి, వారిని చితకబాదారు. ఈ ఘటనలో డ్రైవర్‌సీటులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆజమ్ (32) అక్కడికక్కడే చనిపోయాడు. సల్మాన్, సల్హాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బషీర్, నూర్‌మహ్మద్ స్వల్పంగా గాయపడ్డారు. 
 
సమాచారం అందుకుని ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. గ్రామస్థులను సముదాయించేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినకపోవడంతో లాఠీచార్జి చేసి, చెదరగొట్టారు. గాయపడినవారిని స్థానిక హాస్పిటల్‌లో చేర్పించారు. తమను హైదరాబాద్‌కు పంపించాలని సల్మాన్, సల్హాన్ కోరడంతో వారిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం మలక్‌పేట యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. 
 
ఘటనాస్థలంలోనే చనిపోయిన ఆజం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం నగరానికి తరలించారు. మృతదేహానికి శనివారం కుటుంబ సభ్యులు ఎర్రకుంటలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన ఆజం గూగుల్ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడని స్థానికులు తెలిపారు.