బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (17:05 IST)

గోదావరికి మరింత వరద

రాజమహేంద్రవరం వద్ద గోదావరికి వరద మరింత పెరిగింది. గోదారి ప్రవాహం అత్యంత ప్రమాదకరంగా సాగుతోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 15.6 అడుగుల నీటిమట్టం ఉంది. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. డెల్టాకాల్వలకు 10,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

సముద్రంలోకి 15.51 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. భద్రాచలం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. భద్రాచలం వద్ద గోదావరిలో 44.8 అడుగుల నీటిమట్టం నమోదైంది. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

జల దిగ్బంధంలోనే కోనసీమ గ్రామాలు
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతాలు ఇంకా వాననీటిలోనే నానుతున్నాయి. గత 10 రోజులుగా గోదావరి నదీపాయలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.దీంతో కోనసీమలోని అప్పనపల్లి, జి.పెదపూడి, ముక్తేశ్వరం గ్రామాల్లోని కాజ్‌వేలపై నీరు ప్రవహిస్తోంది.

బూరుగులంక,అరిగెలవారిపేట, జి.పెదపూడిలంక సహా అనేక లంక గ్రామాలు నీట మునిగాయి. దీంతో అక్కడి ప్రజలు మర పడవలు, నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వేలూరుపాడు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలను అధికారులు పునరావాసాలకు తరలించారు.
 
శ్రీశైలం...
ఎగువ పరీవాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. దీంతో అధికారులు 10 గేట్లను పైకెత్తి 3,16,608 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. జలాశయానికి 5,22,902 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.

శ్రీశైలం జలాశయ పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 202.50 టీఎంసీలకు పైగా ఉంది. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 42,378 క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,187 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కల్వకుర్తికి  800క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2025 క్యూసెక్కులు, పొతిరెడ్డిపాడుకు 28000 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు.

మరోవైపు నాగార్జున సాగర్‌ జలాశయానికి కూడా వరద కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 2,05,181 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 6,051 క్యూసెక్కులు ఉంది. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగానూ.. ప్రస్తుతం 520.90 అడుగుల నీటిమట్టం నమోదైంది. జలాశయం పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 150.92 టీఎంసీల నీటి నిల్వ ఉంది.