శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (23:18 IST)

గోదావరి వరదలపై ముఖ్యమంత్రి సమీక్ష... బాధితులకు ఉదారంగా సహాయం

గోదావరి వరదలు, ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తన నివాసంలో సమీక్షించారు. ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ఆదేశించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ విషయలో ఆలస్యం చేయవద్దని అధికారులకు మరోసారి స్పష్టంచేశారు.

విదేశీ పర్యటనను ముగించుకున్న తర్వాత సీఎం తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న తర్వాత గోదావరి వరదలు, ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు.

హోంమంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణం, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ధవళేశ్వరం వద్ద 2,3 ప్రమాద స్థాయి హెచ్చరికలు దాటినప్పుడే దేవీపట్నం మండలంలోని గ్రామాలు ముంపునకు గురవుతాయని, ఇప్పుడు ఒకటో ప్రమాద స్థాయికి చేరకముందే ముంపునకు గురయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

దీనికి కారణాలేంటో అధ్యయనం చేయాలని, తర్వాత తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆతేశించారు. గడచిన 5–6 రోజుల్లోనే 500 టీఎంసీల జలాలు గోదావరి నదిద్వారా సముద్రంలోకి కలిసిపోయినట్టుగా అంచనావేశామన్నారు. వచ్చే 2 రోజులపాటు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కొనసాగే అవకాశాలున్నాయని, మేడిగడ్డ వద్ద ప్రాణహిత నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా వస్తుండడంవల్ల ఈ పరిస్థితి ఉంటుందన్నారు.

గోదావరి పరీవాక ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు లేవని, వచ్చే వారంరోజులపాటు కూడా వర్షసూచన లేదని సీఎంకు చెప్పారు. 3రోజుల్లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వివరించారు. వరద బాధిత ప్రాంతాల్లో సంబంధిత మంత్రులు పర్యటించాలని సీఎం పునరుద్ఘాటించారు.

సకాలంలో సహాయక చర్యలు అందేలా చర్యలుతీసుకోవాలన్నారు. అంటు వ్యాధులు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పశువైద్య శిబిరాలు కూడా ఏర్పాటుచేయాలన్నారు. తాగునీటికి ఎలాంటి కొరత లేకండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.