మూవీ ఆర్టిస్టు అసోసియేషన్(మా) లో తమ వాటా తమకివ్వాలన్న డిమాండ్‌ను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కొత్తగా తెరపైకి తీసుకువచ్చింది. తమ ప్రతిపాదనకు అంగీకరించకపోతే జై తెలంగాణ అన్న వారికే ఓట్లు వేయాలని నినదినిస్తామని చెప్పడంతో మా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.
ప్రస్తుతం మా కార్యవర్గంలో ఉన్న పదవులను సమాన నిష్పత్తిలో పంచడం ద్వారా, అసోసియేషన్‌లో ఆంధ్రా-తెలంగాణ సినిమా ఆర్టిస్టులకు న్యాయం చేయాలన్న డిమాండ్ తెరపైకి రావడం ఆసక్తి కలిగించింది.
ఆ మేరకు ప్యానల్ ప్రకటించిన ప్రకాష్‌రాజ్, మంచు విష్ణు వద్ద తమ ప్రతిపాదన ఉంచేందుకు తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది సివిఎల్ నరసింహారావు సిద్ధమవుతున్నారు.
మరో రెండు నెలలలో జరగనున్న మా ఎన్నికలకు ఇప్పటికే సినీ పరిశ్రమపై పట్టున్న కమ్మ-కాపు వర్గాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో, కొత్తగా ప్రాంతీయవాదం తెరపైకి రావడంతో మా ఎన్నికలు కొత్త మలుపు తిరిగాయి. రాష్ట్ర విభజన ముందు నుంచీ నుంచి ఉన్న మాలో ఆంధ్రా-తెలంగాణకు చెందిన నటీనటులు సభ్యులుగా కొనసాగుతున్నారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత మా పేరును తెలంగాణ మూవీ ఆర్టిస్టు అసోసియేన్‌గా మార్చాలన్న డిమాండ్ చాలాకాలం నుంచి వినిపించింది. ఆ వాదన కొంతకాలం వినిపించినప్పటికీ, తర్వాత ఎందుకో ఆగిపోయింది.
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో పెత్తనం సాగిస్తున్న అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకుల్లో ఎక్కువ శాతం ఆంధ్రాకు చెందిన వారే కావడం, వారికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటం, పరిశ్రమ మొత్తం వారి చేతుల్లోనే ఉండటంతో ఆ వాదన అర్థంతరంగా ఆగిపోయింది.
అయితే తెలంగాణకు చెందిన అగ్ర నిర్మాతలు ఉన్నప్పటికీ, వారు కూడా ఆంధ్రాకు చెందిన పరిశ్రమ పెద్దలతో కలసి ఉండటం కూడా అప్పట్లో ఆ నినాదం నీరుగారిపోవడానికి ఒక కారణమంటున్నారు.
అయితే.. మూడేళ్ల క్రితమే క్యారెక్టర్ ఆర్టిస్టు, ప్రముఖ న్యాయవాది సివిఎల్ నరసింహారావు మాకు ఒక లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ సినిమా సెల్ కన్వీనర్ కూడా అయిన ఆయన.. మా అసోసియేషన్‌ను ఆంధ్రా-తెలంగాణ రాష్ట్రాలుగా విభజించి, రెండు శాఖలుగా ఏర్పాటుచే యాలని మా కార్యవర్గం, డైరక్టర్స్ అసోసియేషన్‌కూ లేఖ రాశారు.
రెండు రాష్ట్రాల్లో ఇద్దరు సినిమాటోగ్రఫీ మంత్రులు, రెండు ఎఫ్‌డీసీలు ఉన్నప్పుడు.. మాలో కూడా ఏపీ-తెలంగాణతో రెండు విభాగాలు ఉంటే తప్పేమిటని ఆయన తన లేఖలో ప్రశ్నించారు. అసలు ఇప్పటిదాకా ఏపీకి సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదని, దానివల్ల ఏపీకి న్యాయం జరగడం లేదని అభిప్రాయపడ్డారు.
చిరంజీవి, పవన్, బాలకృష్ణ వంటి హీరోలంతా ఏపీలోనే ఎన్నికల్లో పోటీచేస్తున్నప్పుడు, అక్కడ కూడా ప్రత్యేకంగా మా విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఏపీలో షూటింగులు జరగడం వల్ల లోకల్ ఆర్టిస్టులకు, ఇతరులకు ఉపాథి ఏర్పడుతుందని సూచించారు.
అయితే ఇప్పటివరకూ మా కార్యవర్గం స్పందించకపోవడంతో, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేన్ అధ్యక్షుడు కూడా అయిన సీవీఎల్.. ఇప్పుడు ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకురావడం, చర్చనీయాంశమయింది. ప్రస్తుత మా కార్యవర్గంలో ఉన్న పదవులన్నీ సమాన నిష్పత్తితో పంచుకోవాలన్న డిమాండ్‌పై సినిమా పరిశ్రమలో చర్చ కూడా జరుగుతోంది.