చినికిచినికి గాలివానలా తయారైన సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలను గణనీయంగా తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పెద్ద దుమారాన్నే రేపింది. ఇది చినికిచినికి గాలివానలా తయారైంది. ఇపుడు ఇదే అంశంపైనే ఏపీలో హాట్ టాపిక్‌గా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఏపీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు ప్రత్యేకంగా సమావేశంకానున్నారు.
ఇటీవల సినిమా టిక్కెట్లను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ను తీసుకొచ్చింది. అన్ని సినిమాలకు ఒకే విధంగా ధరలు ఉండాలన్నదే ఈ జీవో సారాంంశం. దీంతో పలువురు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేసింది. సినిమా టిక్కెట్ల ధరలపై పూర్తి హక్కు నిర్మాత, ఎగ్జిబిటర్లకే ఉంటుందని తీర్పునిచ్చింది. అయితే, హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేసింది. ఇక్కడ సినిమా టిక్కెట్ల పంచాయతీపై విచారణ జరుగుతోంది.
సినీ నిర్మాతలు కోర్టును ఆశ్రయించడాన్ని జీర్ణించుకోలేని ఏపీ ప్రభుత్వం రెవెన్యూ అధికారులతో థియేటర్లలో ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఈ అధికారులు సౌకర్యాల లేమి, అధిక ధరలకు తినుబండారాలు, సినిమా టిక్కెట్ల విక్రయం, లైసెన్సులు లేవన్న సాకుతో అనేక థియేటర్లను సీజ్ చేస్తున్నారు.
మరికొందరు యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు థియేటర్లు నడపలేమని పేర్కొంటూ స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఆ ప్రకారంగా ఇప్పటివరకు దాదాపు 200 వరకు సినిమా థియేటర్లు మూతపడ్డాయి.
ఈ క్రమంలో మంగళవారం ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్లు భేటీకానున్నారు. సినిమా థియేటర్ల మూసివేత, టిక్కెట్ ధరలపై ప్రభుత్వంతో ఎగ్జిబిటర్లు చర్చలు జరుపనున్నారు. ఈ చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది.