శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:02 IST)

దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలీవరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీ .. దర్జాగా సీఎంవో చక్కర్లు!

anantha babu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు పెట్రేగిపోతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. తన వద్ద కారు డ్రైవరుగా పని చేసిన దళిత యువకుడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటికి డోర్ డెలివరీ చేసిన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో దర్జాగా చక్కర్లు కొడుతున్నారు. ఆయన్ను చూసిన సీఎంవో సిబ్బంది విస్తుపోతున్నారు. ఈ హత్య కేసు తర్వాత అనంతబాబును సస్పెండ్ చేసినట్టు వైకాపా అధిష్టానం ప్రకటించింది. కానీ, అది ఉత్తుత్తి ప్రకటనే అని తేలిపోయింది. ఎమ్మెల్సీ అనంతబాబు ఒకవైపు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే మరోవైపు, సీఎంవోకి యధేచ్చగా వచ్చి వెళుతున్నారు. హత్యకేసులో నిందితుడేగాక, పార్టీ నుంచి సస్పెండ్ చేసినా... ముఖ్యమంత్రి కార్యాలయానికి దర్జాగా ఎలా రాగలుగుతున్నారు? సస్పెండ్ చేసి ఉంటే ఆయనతో పార్టీ వ్యవహారాలపై వైకాపా ముఖ్యనేతలు ఏకంగా సీఎం కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఎలా మాట్లాడుతున్నారు? అంటూ పలువురు నేతలు ప్రశ్నించుకుంటున్నారు. 
 
నిజానికి గత 2022 మే నెలలో డ్రైవర్ హత్య ఘటన తర్వాత అనంతబాబును వైకాపా సస్పెండ్ చేసింది. గతేడాది జైలు నుంచి బయటికొచ్చిన తర్వాత ఆయన వైకాపా కార్యకలాపాల్లో పూర్తిస్థాయిలో పాల్గొంటున్నారు. రంపచోడవరంలో ఒకసారి, తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరోసారి సీఎం జగన్ పర్యటించినపుడు ఆయనతోపాటు వేదిక పంచుకున్నారు. సస్పెండ్ చేశాక కూడా ఆయన వైకాపా సభ్యుడిగానే కొనసాగుతున్నారు. వైకాపా అధికారిక వెబ్‌సైట్లోనూ అనంతబాబు ఆ పార్టీ ఎమ్మెల్సీగానే చూపిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైకాపా శాసనసభాపక్ష కార్యాలయంలో కనిపిస్తున్నారు. ఇపుడు ఏకంగా సీఎంవోలో దర్జాగా తిరుగుతున్నారు.