బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 జులై 2018 (09:32 IST)

బెయిల్‌పై బయటకొచ్చిన స్వాతి.. జైల్లోనే ప్రియుడు రాజేశ్

ప్రియుడి మోజులోపడి భర్తను అతి కిరాతకంగా హతమార్చిన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్‌కు చెందిన స్వాతి అనే నిందితురాలికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె శుక్రవారం మహబూబ్ నగర్ జైలు నుంచి విడుదలై

ప్రియుడి మోజులోపడి భర్తను అతి కిరాతకంగా హతమార్చిన తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్‌కు చెందిన స్వాతి అనే నిందితురాలికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆమె శుక్రవారం మహబూబ్ నగర్ జైలు నుంచి విడుదలైంది. అయితే ఆమెను తీసుకెళ్లడానికి కుటుంబసభ్యులు నిరాకరించడంతో ఆమెను స్టేట్ హోంకు తరలించారు.
 
వాస్తవానికి ఆమెకు మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈనెల 16వ తేదీనే షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. ఇద్దరు వ్యక్తుల జామీను (పూచీకత్తు) ఇవ్వాలన్న షరతు అందులో ఒకటి. అయితే, ఆమెకు జామీను ఇచ్చేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. దీంతో జైల్లోనే ఉండాల్సి వచ్చింది. 
 
కాగా, బుధవారం నాగర్‌కర్నూల్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు జామీను ఇవ్వగా శుక్రవారం మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు, కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో ఆమెను సాయంత్రం జైలు నుంచి విడుదల చేశారు. అయితే స్వాతిని తీసుకువెళ్లడానికి కుటుంబ సభ్యులు, బంధువులెవరూ జైలు దగ్గరకు రాలేదు. 
 
ఈ నేపథ్యంలో స్వాతి, ముందుగానే కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థకు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆశ్రయం కల్పించాలని లేఖ రాశారు. దీంతో కలెక్టర్, న్యాయసేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా జైలు అధికారులు స్వాతిని నేరుగా జిల్లా కేంద్రంలోని రాష్ట్ర సదనానికి తరలించారు. 
 
భర్తను హతమార్చిన తీరిది... 
నాగర్ కర్నూల్ జిల్లా కొత్తకోట మండలం అజ్జకోలు గ్రామానికి చెందిన సుధాకర్‌ రెడ్డి అనే వ్యక్తితో స్వాతికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆమె రాజేష్‌ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. ప్రియుడి మోజులోపడి గతేడాది నవంబర్‌లో సుధాకర్‌ రెడ్డిని హతమార్చేందుకు స్కెచ్ వేసింది. ప్రియుడు రాజేష్‌తో కలిసి నాగర్‌కర్నూల్‌లోని తన ఇంట్లోనే సుధాకర్‌ రెడ్డిపై దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి నవాబుపేట సమీపంలో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. తర్వాత రాజేష్ మొహంపై యాసిడ్‌ పోసి.. అతడే సుధాకర్‌ రెడ్డిగా నమ్మించే ప్రయత్నం చేశారు. 
 
రాజేష్‌నే సుధాకర్ రెడ్డిగా భావించి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని స్వాతి భావించింది. సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు కూడా మొహానికి బ్యాండేజ్‌లు ఉండటంతో అతడ్ని గుర్తించలేకపోయారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాజేష్ వ్యవహారశైలిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అప్పుడు సుధాకర్‌ రెడ్డి పేరిట చికిత్స పొందుతున్న రాజేష్‌ వేలిముద్రలు సేకరించడంతో అసలు విషయం బహిర్గతమైంది. ఈ హత్య వ్యవహారం మొత్తం బయటపడింది. స్వాతితో పాటూ ప్రియుడు రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. 8 నెలలుగా ఇద్దరు మహబూబ్‌నగర్ జైల్లో ఉండగా స్వాతికి బెయిల్ మంజూరైంది. ఈ కేసులో మరో నిందితుడు రాజేశ్‌కు ఇంకా బెయిల్‌ లభించలేదు.