గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 నవంబరు 2021 (16:10 IST)

బాబు ట్రాప్‌లో నందమూరి కుటుంబం.. నోటికొచ్చినట్టు మాట్లాడితే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా?

అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేస్తూ, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉండే భువనేశ్వరిని కూడా రాజకీయాల్లోకి లాగి అవమానించారని చంద్రబాబు నాయుడు కన్నీటిపర్యంతమయ్యారు.
 
తెలుగుదేశం పార్టీ నేతలే కాకుండా నందమూరి కుటుంబం కూడా వైసిపి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ మా కుటుంబం జోలికి వస్తే సహించేది లేదు ఖబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక తాజాగా నందమూరి చైతన్య కృష్ణ వైసిపి నేతల తీరుపై మండిపడ్డారు. రాజకీయాల కోసం మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ ధ్వజమెత్తారు. మీకు అసలు సిగ్గు లజ్జ ఉందా అంటూ నందమూరి చైతన్య కృష్ణ విరుచుకుపడ్డారు. 
 
మా తాత ఎన్టీఆర్ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారని గుర్తు చేసిన చైతన్య కృష్ణ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడితే మహిళలు రాజకీయాల్లోకి వస్తారా అంటూ చైతన్య వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వల్లభనేని వంశీ, కొడాలి నాని లకు పదవుల్లో కొనసాగే అర్హత లేదని, వారిని బర్తరఫ్ చేయాలని నందమూరి చైతన్య కృష్ణ డిమాండ్ చేశారు. నందమూరి కుటుంబంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమాపణ తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అంటూ నందమూరి చైతన్య కృష్ణ స్పష్టం చేశారు.