నారప్ప డైలాగ్ చెప్పిన ఎమ్మెల్సీ లక్ష్మణరావు...పిల్లల కేరింతలు!
"మన దగ్గర భూముంటే తీసేసుకుంటారు... డబ్బుంటే లాగేసుకుంటారు... కానీ చదువును ఒక్కటి మాత్రం మనదగ్గర్నుంచి ఎవరూ తీసుకోలేరు చిన్నప్ప..." అంటూ నారప్ప సినిమాలోని డైలాగ్ ను పలికారు ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు. దీంతో విద్యార్థులందరూ ఒక్కసారిగా కేరింతలు కొట్టారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మనబడి నాడు - నేడు మొదటి దశ ప్రజలకు అంకితం, రెండవ దశ పనులు ప్రారంభం, జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కె.యస్. లక్ష్మణరావు విశిష్ట అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్య ప్రాముఖ్యం గురించి వివరిస్తూ, నారప్ప సినిమాలోని డైలాగును ఉదహరించారు. విద్యార్థులు లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలపై ప్రశంసలను గుప్పించారు.
నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలకు శాసనమండలిలో ఆమోదం తెలిపిన విషయాలను ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుర్తు చేశారు. చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని చిన్న వయసులోనే గుర్తించాలని సూచించారు.