శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 11 మే 2017 (09:33 IST)

సాహో హరీష్ రావు : కరుడుగట్టిన ప్రాంతీయవాది కాదు... ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు అంటే.. కరడుగట్టిన ప్రాంతీయవాదిగా ముద్రవుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు వ్యవహారశైలి, పేల్చిన మాటలతూటాలే ఇందుకు నిద

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి టి.హరీష్ రావు అంటే.. కరడుగట్టిన ప్రాంతీయవాదిగా ముద్రవుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు వ్యవహారశైలి, పేల్చిన మాటలతూటాలే ఇందుకు నిదర్శనం. కానీ, ఆయనలోనూ ఓ మానవతావాది దాగివున్నాడు. ముఖ్యంగా.. ఆపదసమయంలో ఆపన్నహస్తం అందించేందుకు అందరికంటే ముందుంటారు. కష్టాల్లో ఉన్నవారు.. చిన్నాపెద్దా.. పేద ధనిక అనే తేడా ఉండదు. ఎవరైన కష్టాల్లో ఉన్నట్టు తెలిసిందంటే అక్కడ వాలిపోయి.. అన్నీ తానై చూస్తారు. ఇందుకు తాజాగా హైదరాబాద్‌లో ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో గాయపడినపుడు హరీష్ రావు చేసిన సాయమే ఇందుకు ప్రత్యక్ష సాక్షి. 
 
హైదరాబాద్, బంజారాహిల్స్‌లో నిషిత్‌ మరణవార్త గురించి తెలియగానే మంత్రి హరీశ్‌రావు చలించిపోయారు. ఏపీ మంత్రి నారాయణ లండన్‌లో ఉన్నారని తెలిసి, ఆయన కుటుంబసభ్యులకు అండగా ఉండేందుకు నిద్రలేవగానే నేరుగా అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. టీ షర్టుతోనే ఆస్పత్రికి రావడం గమనార్హం. ఆ తర్వాత ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఉస్మానియాకు చెందిన ఫోరెన్సిక్‌ వైద్య నిపుణులను అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చి క్షణాల్లో పోస్టుమార్టం చేయించి, మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 
 
అనంతరం నిషిత్‌ మృతదేహాన్ని హెలికాఫ్టర్‌ ద్వారా నెల్లూరు తరలించేందుకు ఏవియేషన్‌ అధికారులతో చర్చించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవటంతో అన్ని ఏర్పాట్లతో అంబులెన్స్‌లో నెల్లూరు చేర్చారు. అలాగే, ఇదే ప్రమాదంలో మృతి చెందిన నిషిత్ స్నేహితుడు రాజా రవిచంద్ర మృతదేహాన్ని అతడి స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరుకు పంపేలా చర్యలు తీసుకున్నారు. కానీ, బంధువుల సూచనతో మొదట బేగంపేటకు చేర్చారు. అనంతరం అక్కడ నుంచి టంగుటూరు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి అక్కడే ఉండి.. హరీశ్‌రావు తీసుకున్న చొరవను, మంత్రి నారాయణ కుటుంబానికి అండగా నిలిచిన తీరును ఏపీ నేతలు కొనియాడారు. 
 
కాగా.. కష్టాల్లో ఉన్నవారిని ఇలా ఆదుకోవడం హరీశ్‌రావుకు కొత్త కాదని, ఆపద ఎక్కడ ఉంటే హరీశ్‌ అక్కడ ఉంటారని అక్కడున్నవారు వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు చెందిన ఒక మహిళకు రెండు కిడ్నీలూ పాడైనట్టు ఓ వార్తా పత్రికలో కథనం వస్తే.. రెండు రోజుల క్రితమే ఆయన దగ్గరుండి నిమ్స్‌లో చేర్పించారని, రూ.50 వేలు ఆర్థిక సాయం అందించారని ఒకరు చెప్పారు. 2014లో మాసాయిపేట రైలు ప్రమాదం జరిగినప్పుడు చివరి మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించేవరకూ ఆయన అక్కడే ఉండి బాధితులకు సాయపడ్డారని గుర్తుచేసుకున్నారు. నారాయణ కుటుంబానికి హరీశ్‌రావు అండగా నిలిచిన వైనంపై నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.