శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 30 నవంబరు 2021 (16:09 IST)

డిసెంబర్ 11న జాతీయ లోక్ అదాలత్!

కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని కృష్ణా జిల్లా జడ్జి  రామకృష్ణ చెప్పారు. కాలహరణం, ఆస్తి అన్యాక్రాంతం తదితర ముప్పులను సత్వరమే అధిగమించాలంటే, కక్షిదారులు రాజీ మార్గంలో అందరికి ఆమోదయోగ్యంగా కేసులను డిసెంబర్ 11న‌ జరిగే  జాతీయ లోక్ అదాలత్ పరిష్కరించుకోవాలని కృష్ణా జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గూడూరు రామకృష్ణ సూచించారు.
 
 
కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో జిల్లా జ‌డ్జి తన చాంబర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కోర్టు భవన సముదాయాలలో డిసెంబర్ 11న శ‌నివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ నున్నట్లు ఆయన తెలిపారు. గత ఏడాది కోవిడ్ కారణంగా కోర్టులు సరిగా జరగకపోవడంతో కేసుల సంఖ్య అధిక మయ్యాయన్నారు.

 
కృష్ణా జిల్లాలో మొత్తం 89 వేల 171 కేసులు ఉన్నాయని, వీటిలో తాము కనీసం 10 శాతం కేసులను పరిష్కరించే దిశలో తీవ్రంగా కృషి చేయనున్నట్లు జిల్లా జడ్జి ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజలు తెలియజేసేందుకు న్యాయవాదులు లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజారామ్ పాల్గొన్నారు.