మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 అక్టోబరు 2020 (08:09 IST)

రాయలసీమ ఎత్తిపోతలకు ఎన్‌జిటి బ్రేక్.. పర్యావరణ అనుమతులు తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు తప్పనిసరి అని జస్టిస్‌ రామకృష్ణన్‌, నిపుణులు సైబల్‌ దాసు గుప్తాలతో కూడిన నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) ధర్మాసనం తేల్చి చెప్పింది.

రాయలసీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి వరద రోజుల్లో రోజుకు మూడు టిఎంసిల నీటిని తీసుకునేలా, పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వగుండా 80 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.

రూ.3,278 కోట్లతో టెండర్లను కూడా ఖరారు చేసింది. ఈ పథకం పూర్తయితే తెలంగాణ ప్రాజెక్టులన్నీ దెబ్బతింటాయని, దీనికి ఎలాంటి అనుమతులు లేవని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు, కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసింది.

తెలంగాణకు చెందిన జి.శ్రీనివాస్‌ కూడా ఈ పథకానికి పర్యావరణ అనుమతులు లేవని ఎన్‌జిటిలో ఫిర్యాదు చేశారు. ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ఎన్‌జిటి ఈ నెల 3న తీర్పును రిజర్వు చేసింది. గురువారం చెన్నరులోని ఎన్‌జిటి ఈ మేరకు తుది తీర్పును ప్రకటించింది.

కృష్ణా జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నందువల్లే రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును చేపట్టామనే ఆంధ్రప్రదేశ్‌ వాదనను తోసిపుచ్చింది. డిపిఆర్‌, ప్రాజెక్టు సంబంధిత అనుమతుల్లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టద్దని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్దేశించిన విషయాన్ని ప్రస్తావించింది.