అదుపులోకి రాని కరోనా - ఏపీలో రాత్రి కర్ఫ్యూ పొడగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోమారు రాత్రిపూట కర్ఫ్యూను పొడగించింది. ఇది ఈ నెల 21వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదివారం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.
కాగా, ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అదుపులోకి రావట్లేదు. దీనిపై నిన్న సర్కారు సమీక్ష సమావేశం నిర్వహించి, రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ఇదిలావుంటే, శనివారం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్ మేరకు... గడచిన 24 గంటల్లో 69,088 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,535 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 299 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 237, నెల్లూరు జిల్లాలో 211 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 8 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.
అదేసమయంలో రాష్ట్రవ్యాప్తంగా 2,075 మంది కరోనా నుంచి కోలుకోగా, 16 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 13,631కి పెరిగింది.
రాష్టంలో నేటివరకు మొత్తం 19,92,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,60,350 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,210 మంది చికిత్స పొందుతున్నారు.